-
30 ఏళ్ల జర్నలిజం ప్రస్థానానికి స్వస్తి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్
-
తెలంగాణ రక్షణ సేన పార్టీ తీర్థం పుచ్చుకున్న మహమ్మద్ మజీద్
-
ఎల్లారెడ్డిపేట ‘ఆదర్శ’ టైప్ ఇన్‌స్టిట్యూట్ యజమానిగా సుపరిచితుడు
శంకరపట్నం (డిసి ప్రతినిధి), మే 21: ఆయన ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి. ఎల్లారెడ్డిపేట నివాసి, సీనియర్ జర్నలిస్ట్, ఆదర్శ టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ మజీద్ (మజీద్ సార్) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కులమతాలకు అతీతంగా ‘హిందూ ముస్లిం భాయి భాయి’ అనే నినాదంతో ముందుకు సాగే మజీద్ సార్.. సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్టుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ప్రజాసేవే లక్ష్యంగా కలం వీడి, కద్దర్ చొక్కా తొడిగారు.
కుటుంబ నేపథ్యం – విద్యాభ్యాసం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మైనారిటీ వర్గానికి చెందిన బిపాషా, వహీద్ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో మజీద్ అందరికంటే పెద్దవాడు. చిన్నతనం నుంచే సామాజిక సేవా కార్యక్రమాలపై మక్కువ చూపిన మజీద్.. బిఏ (BA), హిందీ పండిత్ పూర్తి చేశారు. సమాజంలో మార్పు కోసం జర్నలిజం వైపు అడుగులు వేశారు.
తండ్రికి తగ్గ తనయులుగా ఆయన ఇద్దరు కుమారులు కూడా సమాజ సేవలోనే ఉన్నారు. పెద్ద కుమారుడు న్యాయవ్యవస్థపై మక్కువతో న్యాయవాదిగా (Advocate) రాణిస్తుండగా, చిన్న కుమారుడు వైద్య వృత్తిని ఎంచుకుని డాక్టర్‌గా (Doctor) ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
‘ఆదర్శ’ ఇన్‌స్టిట్యూట్ ద్వారా వేలాది మందికి ఉపాధి
మజీద్ గారు కేవలం జర్నలిస్టుగానే కాకుండా విద్యా రంగంలోనూ రాణించారు. 1992లో ‘ఆదర్శ టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్’ను, ఆ తర్వాత 1998లో ‘కంప్యూటర్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్’ను స్థాపించారు. ఈ సంస్థల ద్వారా ఎంతోమంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి, వారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
జర్నలిస్టుగా చెరగని ముద్ర: ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్‌కు ఏకంగా పదిసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత మజీద్ గారికి దక్కుతుంది. ప్రస్తుతం ఆయన ప్రెస్ క్లబ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఐజేయూ (IJU) రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 30 ఏళ్ల జర్నలిజం కెరీర్‌లో అనేక సామాజిక కథనాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
కరోనా కష్టకాలంలో అండగా..
సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే మజీద్ గారు.. కరోనా మహమ్మారి సమయంలో జర్నలిస్టుల కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందే రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న బాధితులకు త్వరితగతిన అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
రాజకీయ ప్రస్థానం – కేటీఆర్ గెలుపులో కీలక పాత్ర
మజీద్ గారికి రాజకీయాలు కొత్తేమీ కాదు. 1998లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన నాటి సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయనను జిల్లా మైనారిటీ సెల్ విభాగం కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత 2014లో ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల్లో సీపీఎం (CPM) పార్టీ తరఫున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) గెలుపు కోసం మజీద్ గారు తెరవెనుక ఉండి గట్టిగా కృషి చేశారు. కేటీఆర్ విజయంలో ఆయన కీలక భూమిక పోషించారనే చర్చ ఇప్పటికీ మండలంలో నడుస్తోంది.
తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరిక
ప్రస్తుతం మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో మజీద్ గారు మే 18న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె ఆహ్వానం మేరకు పార్టీలో చేరి ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
మజీద్ సార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవా దృక్పథం కలిగిన మజీద్ గారు రాజకీయాల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
