కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే (PMJ) జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను గుర్తించి, అందులోని ముగ్గురు కీలక సభ్యులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. బీహార్ జైలులో ఉండి “ది గోల్డెన్ థీఫ్”గా పేరుగాంచిన సుభోద్ సింగ్ ఈ భారీ దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది.
ఘటన నేపథ్యం:
ఈ నెల 3వ తేదీన కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగులు ఆయుధాలతో విరుచుకుపడ్డారు. సిబ్బందిని బెదిరించి సుమారు రూ. 82.02 లక్షల విలువైన 161 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఈ క్రమంలో ప్రతిఘటించిన నలుగురు సిబ్బందిపై నిందితులు కాల్పులు జరిపి గాయపరిచారు.
నిందితుల అరెస్ట్ మరియు విచారణ:
పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్‌ను వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులు రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్‌లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తరలించారు. వీరి నుంచి రూ. 51,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా ప్లాన్‌తో దోపిడీ:
విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. సుభోద్ సింగ్ గ్యాంగ్ సభ్యులు రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చి ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. దోపిడీకి అవసరమైన ఆరు పిస్టల్స్, మ్యాగజైన్లను మహారాష్ట్రలోని గడ్‌చందూర్ వద్ద అందుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లు, దొంగతనంగా కొనుగోలు చేసిన సిమ్ కార్డులను వాడుతూ పోలీసుల కళ్లు గప్పి ధర్మపురిలోని లాడ్జ్‌లలో బస చేశారు.
దోపిడీ అనంతరం నిందితులు గోదావరి నదిని దాటి రైళ్లలో పారిపోగా, మరికొందరు అడవి మార్గంలో కారులో పరారయ్యారు. ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్‌తో పాటు మరో ఏడుగురి కోసం ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసుల హెచ్చరికలు:
ఈ ఉదంతం నేపథ్యంలో బ్యాంకులు, జ్యువెలరీ షాపుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. లాడ్జ్ యజమానులు తప్పనిసరిగా ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతే గదులు కేటాయించాలని ఆదేశించారు.
also read
లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు: నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన పెద్దపల్లి కోర్టు
అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతో చూడండి!
