హైదరాబాద్: తెలంగాణలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ లేదా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వాడటం తెలియని రైతుల కోసం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ‘మీసేవ’ (MeeSeva) కేంద్రాల ద్వారా యూరియాను బుక్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మీసేవ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా ఈ సేవలను ప్రారంభించాయి.
మీసేవ ద్వారా యూరియా బుకింగ్ ప్రాసెస్ ఇదే:
-
కావలసిన పత్రాలు: రైతు తన పట్టాదారు పాస్‌బుక్ నంబర్ (Passbook Number) మరియు దాంతో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లాలి.
-
వివరాల నమోదు: మీసేవ ఆపరేటర్ రైతు పాస్‌బుక్ ఆధారంగా సాగు విస్తీర్ణం, వేసిన పంటల వివరాలను కంప్యూటర్ లో నమోదు చేస్తారు.
-
డీలర్ ఎంపిక: రైతు తనకు కావలసిన యూరియా పరిమాణాన్ని (క్వాంటిటీ) ఎంచుకుని, తమకు దగ్గరలోని ఎరువుల డీలర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
-
OTP వెరిఫికేషన్: రైతు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేయగానే బుకింగ్ ఐడీ (Booking ID) జనరేట్ అవుతుంది.
రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
48 గంటల గడువు: మీసేవ ద్వారా వచ్చిన బుకింగ్ ఐడీ.. బుక్ చేసిన రోజు కాకుండా కేవలం 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ లోపే రైతులు తాము ఎంచుకున్న డీలర్ వద్దకు వెళ్లి యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. గడువు దాటితే బుకింగ్ రద్దవుతుంది.
-
సేవా రుసుము: మీసేవ కేంద్రంలో ఈ బుకింగ్ సేవ కోసం కేవలం ₹10 రూపాయల నామమాత్రపు ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
-
మొబైల్ నంబర్ అలర్ట్: ఓటీపీ పొందడం కోసం పట్టాదారు పాస్బుక్కు లింక్ అయిన మొబైల్ నంబర్ కచ్చితంగా యాక్టివ్‌లో ఉండాలి.
కేవలం అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే సబ్సిడీ యూరియాను బుక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), మండల వ్యవసాయ అధికారి (MAO) లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
