ప్రమాద స్థాయిలో ప్రవాహిస్తున్న నది
న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీని యమునా నది మరోమారు భయపెడుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పైఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో హత్నికుండ్ డ్యామ్ నుంచి నీటిని వదులుతున్నారు. సెంట్రల్ వాటర్ బోర్డు వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు 203.48 విూటర్ల నీటి ప్రవాహం నమోదు అయినట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నాటి వరద మట్టం 205.33 మీటర్లకు చేరింది. హత్నీకుండ్ బ్యారేజీ నుంచి 30 వేల 153 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలవుతోంది. ప్రస్తుతల పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో మళ్లా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెల జులైలో వచ్చిన వరదలతో పోల్చినప్పుడు ఇది కొంచెం తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. జులైలో కురిసిన భారీ వర్షాలకు యమునా నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగిన విషయం తెలిసిందే. జులై 12న యమునా నది నీటి మట్టం 207.55 విూటర్లకు చేరింది. 45 ఏండ్ల తరవాత ఈ స్థాయిలో నీటి మట్టం పెరగడం ఇదే మొదటిసారి. 1978లో యమునా నది నీటి మట్టం 204.79 విూటర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సెక్షన్ 144 అమలు చేశారు. ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొంటామని కేజీవ్రాల్ ప్రభుత్వం చెప్పింది. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అటు నోయిడా నగరమూ వరదల ధాటికి అల్లాడిపోతోంది. ఇప్పటికే సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల తాగేందుకు నీళ్లు కూడా లేవు. కొన్ని చోట్ల నిత్యావసర వస్తువులు ఖాళీ అయ్యాయి. వరద ముంపుతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.