భారతదేశం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. విశాలమైన ఈ భూభాగంలో తరచూ ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఎన్నికల సిబ్బంది, ఇతర సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఉంటుంది. ప్రజలు కూడా ఇబ్బందికి గురవుతుంటారు. దీన్ని అధిగమించేందుకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు తెరలేపింది. జమిలి ఎన్నికలు అంటే దేశమంతా ఒకే సారి ఎన్నికలు జరపాలి. అన్ని రాష్ట్రాల్లో ఒకే సారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుపుతారు.
నిప్పులేనిదే పొగరాదంటారు. జమిలి ఎన్నికలు సాధ్యం కాదని మొన్నటికి మొన్న ఓ కేంద్ర మంత్రి ప్రకటించాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. విపక్షాలు అయితే అది సాధ్యం కాని పని అని మిన్నకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ ఈ అంశం తెరపైకి రావడం చూస్తుంటే మోడీ ఎంతబలంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకేదేశం ఒకే ఎన్నిక అన్నది మోడీ నినాదం. అంతేకాదు ఆయన కోరిక. ఇందులో తప్పేవిూ లేదు. తప్పకుండా దేశంలో అదేపనిగా ఎన్నికలు నిర్వహించకుండా ఒకే దఫాలో నిర్వహించడంలో తప్పు లేదు. మన రాజకీయ నాయకులు జీవితమంతా ఎన్నికలతో గడవాలని కోరుకుంటారు. ఎలక్షన్లు, కలెక్షన్లు అన్న మాదిరిగా సాగిపోవాలని అనుకుంటున్నారు. అందుకే వారు వ్యతిరేకిస్తారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికల అధ్యయనంపై కమిటీ వేయడం అన్నీ వేగంగా జరిగిపోయాయి. అంటే జమిలిపై తప్పకుండా ఓ నిర్ణయం తీసుకుంటారని అనుకోవాలి. జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటే… ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్టాల్రను ఏవిధం గా పరిగణిస్తారన్ది ముఖ్యం. అలాగే త్వరలో అంటే 2024లో ఎన్నికలు జరిగే రాష్టాల్ల్రో ఎలాంటి పరిస్తితులు ఉండబోతుననాయో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఓ మంచి పనిచేయాలని అనుకున్నప్పుడు కొంత నష్టం భరించకా తప్పదు. మొత్తంగా దేశ రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి సంబంధించి అతి కీలకమైన నిర్ణయాలను తీసుకోవడానికి బీజేపీ సిద్దం అవుతోందని తాజా పరిణామాలను బట్టి అంచనా వేయవచ్చు. ఈ చర్చ ఇలా ఉండగానే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండాను ఇంత వరకూ బహిర్గత పర్చలేదు. త్వరలో చెబుతామంటున్నారు. అదేమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఖచ్చితంగా జమిలీ ఎన్నికల నిర్ణయం జరగబోతోందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపి స్తోంది. దీనికి కారణం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో జమిలీ ఎన్నికలపై కమిటీ వేయడం .. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే నివేదిక ఇవ్వాలని సూచించడం ఓ సూచికగా కనిపిస్తోంది. కానీ అంతకు మించి దేశం ఆశ్చర్యపోయే నిర్ణయాలు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది. కేంద్రం ఏ మార్పులు తీసుకు రావాలనుకుంటున్నా.. ప్రజాస్వామ్యంలో కీలక మార్పులు రానున్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మార్పు వస్తుంది. ఇది దేశానికి మంచిదా కాదా అన్నది.. బిల్లులు పెట్టిన తర్వాత ఎలాగూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ కేంద్రం ఏం చేయాలనుకుంటే అది చేయ గలుగుతుంది. ఎందుకంటే అధికారం కేంద్రం చేతుల్లో ఉంది. ఒక వేళ ప్రజావ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే బీజేపీ మూల్యం చెల్లించుకుంటుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించిన తర్వాత ఢిల్లీలో ఓ రకమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో 18 మంది సభ్యులతో కమిటీ..సెప్టెంబర్ 17వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం. దీనిపై ఢిల్లీతోపాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. రామ్‌నాథ్ కోవింద్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కావడం కూడా చకచకా జరిగిపోయింది. ఏం జరిగిందో తెలియ కున్నా బీజేపీ అనుకూల పక్షాలన్నీ జమలీ ఎన్నికలకు మద్దతుగా మాట్లాడటం ప్రారంభించాయి. అధికారులంతా ఢిల్లీలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు కూడా ఇచ్చిందని సమచారాం. కేబినెట్ కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు అందరూ ఢిల్లీలోనే ఉండాలని.. రాష్టాల్ర పర్యటనలు రద్దు చేసుకోవాలని.. మిగతా అన్ని పనులు రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీకి వచ్చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి లేకుండా ఏ శాఖ కార్యదర్శి ఢిల్లీ వదిలి వెళ్లరాదంటూ హుకూం జారీ చేసింది. ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురానున్నందున అధికారులపై ఈ ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది. లోక్ సభ, రాష్టాల్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని.. ఎన్నికల నుంచి పరిపాలనా దృష్టిని అభివృద్ధిపై మళ్లించవచ్చని లా కమిషన్ ఇప్పటికే సూచించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం నిరంతరం ఎన్నికల ప్రక్రియలో ఉండకుండా నిరోధించవచ్చు. అందువల్ల పరిపాలన దృష్టి అభివృద్ధి పైనే ఉంటుందని లాకమిషన్ నివేదిక సూచించింది. కానీ ప్రస్తుత రాజ్యాంగ చట్టంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదని కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. ఇది జరగాలంటే రాజ్యాంగంలో సవరణ అవసరం అని తెలిపింది. అందుకే రాజ్యాంగ సవరణల బిల్లును ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఫ్‌ువాల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో వెల్లడించారు. అయితే ఆ సవరణల కోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందనే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశాల్లో రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించి..జమిలి బిల్లు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మొత్తంగా జమిలి ఎన్నికలు, మహిళా బిల్లు, కామన్ సివిల్ కోడ్ వంటి కీలకమైన నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. ఇందులో ఏది నిజం..ఏది అబద్దం..ఏమి జరగబోతు న్నదన్నది త్వరలో స్పష్టం కానున్నది.