Tamilanadu” వేలూరు, జూలై 24:
తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అసలు నిజాన్ని బయటపెట్టింది… కేవలం మూడేళ్ల పాప! తన తండ్రి హత్యకు కారణమైన వారిని చిన్నారి పేర్లు చెప్పడంతో పోలీసులు అసలు కధను తెలుసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే..
వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన భారత్ (36) అనే వ్యక్తి చెన్నైలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన నందిని (26)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భర్త నగరంలో పని చేస్తుండగా, నందిని ఇంటి వద్దే ఉండేది. ఇదే సమయంలో ఆమెకు ఎదురింట్లో నివసించే సంజయ్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భారత్ ఆమెను పలు మార్లు హెచ్చరించాడు. కానీ నందిని తీరును మార్చుకోలేదు.
హత్యకు పథకం:
ఈ నెల 21వ తేదీన భారత్ తన భార్య, చిన్న కూతురిని బైక్‌పై దుకాణానికి తీసుకెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో, నందినితో ముందుగా వేసిన పథకం ప్రకారం, రోడ్డుపై కొబ్బరిమట్టలు వేయించారు. వాటిని దాటే సమయంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఇదే సమయంలో, పొదలో దాక్కొన్న సంజయ్ బైక్ నుండి పడిన భారత్‌ను కత్తితో పొడిచి హత్య చేసి అక్కడినుండి పరారయ్యాడు.
పాప చెప్పిన నిజం:
పోలీసులకు నందిని ఇచ్చిన సమాచారం పొంతనలేకుండా ఉండటంతో వారు మూడేళ్ల చిన్నారిని ప్రశ్నించారు. చిన్నారి మాటల్లో… “సంజయ్ మామ తన తండ్రిని కొట్టేసి పారిపోయాడు” అన్నది. దీంతో అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేపట్టి, నందిని మరియు సంజయ్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసుల అనుమానాన్ని మూడేళ్ల పాప స్పష్టంగా నిర్ధారించింది. భర్త హత్యకు కారణం వివాహేతర సంబంధమేనని తేలింది. ప్రస్తుతం నిందితులు రిమాండ్‌లో ఉన్నారు.
