ఆదరణను బట్టి 24 గంటలూ నడిపేందుకు సిద్ధం, త్వ‌ర‌లో ప్ర‌తిమా, చ‌ల్మెడ, మాన‌కొండూర్ వైపు.. మంత్రి పొన్నం

కరీంనగర్‌లో అందుబాటులోకి సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు: ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి
కరీంనగర్:
కరీంనగర్ నగర పౌరులకు ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్ నుండి ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సు సేవలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. బస్సు సేవలను ప్రారంభించిన అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు బస్సులో ఎక్కి వాగేశ్వరి కాలేజీ వరకు ప్రయాణించారు.
ప్రయాణికుల ఆదరణను బట్టి 24 గంటల సేవలు
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కరీంనగర్ ప్రజలు చాలా కాలంగా కోరుకుంటున్న సిటీ బస్సు సర్వీసులను నెరవేర్చినట్లు తెలిపారు. పెరిగిన నగర అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు మరియు వయోవృద్ధుల ప్రయాణ సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

తొలి దశలో కరీంనగర్ నుంచి వాగేశ్వరి కాలేజీ, చింతకుంట, కొత్తపల్లి హవేలీ రూట్లలో బస్సులను అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే ప్రతిమ, చల్మేడ మెడికల్ కాలేజీలతో పాటు మానకొండూరు వైపు కూడా సర్వీసులు విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికుల స్పందనను బట్టి ఈ బస్సులను 24 గంటల పాటు నడపడంతో పాటు అవసరమైన మార్గాల్లో అదనపు బస్సులను కేటాయిస్తామని వెల్లడించారు.

ఆర్టీసీని బలోపేతం చేస్తున్నాం
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారని మంత్రి చెప్పారు. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసే క్రమంలో కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు మరియు పాత బకాయిల చెల్లింపులు వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ, 65 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ కుమార్ దేశాయ్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.