ప్రారంభించనున్న మంత్రి పొన్నం
కరీంనగర్ : కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో నూతనంగా ప్రవేశపెడుతున్న ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకుఅధికారికంగా ప్రారంభించనున్నారు.
నగర జనాభా, అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు మరియు వృద్ధులు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
తొలిదశలో నడిచే రూట్లు ఇవే:
కరీంనగర్-2 డిపో పరిధిలో మొదటి దశగా 3 సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇవి క్రింది ప్రధాన మార్గాల్లో సేవలు అందిస్తాయి:
-
కరీంనగర్ – వాగేశ్వరి కాలేజీ
-
కరీంనగర్ – చింతకుంట
-
కరీంనగర్ – కొత్తపల్లి హవేలీ
విస్తరణ ప్రణాళిక: నగరంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు మరియు నివాస ప్రాంతాలను అనుసంధానించేలా ఈ రూట్లను డిజైన్ చేశారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రయాణికుల నుండి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో మరిన్ని రూట్లకు ఈ సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
