కొత్తపల్లిలో 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటు

కొత్తపల్లి పీహెచ్‌సీ ఆవరణలో 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రి నిర్మాణం
‘నామ్‌’ పథకం కింద రూ. 15 కోట్లు మంజూరు — మొదటి విడతగా రూ. 7.50 కోట్లు విడుదల
నిర్మాణ స్థలాన్ని తనిఖీ చేసిన ఆయుష్ ఆర్డీడీ డాక్టర్ ప్రమీలాదేవి, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆవరణలో ప్రతిపాదిత 50 పడకల ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటు పనులు వేగం పుంజుకున్నాయి. ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని వరంగల్ ఆయుష్‌ ప్రాంతీయ ఉప సంచాలకులు (ఆర్డీడీ) డాక్టర్ ప్రమీలాదేవి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్వప్రసాద్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కలెక్టర్‌కు విజ్ఞప్తి — త్వరలోనే స్థల స్వాధీనం
స్థల పరిశీలన అనంతరం ఆయుష్ అధికారులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరాములను కలిశారు. కేటాయించిన స్థలాన్ని వీలైనంత త్వరగా ఆయుష్‌ శాఖకు స్వాధీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన ఆమోద పత్రాలను త్వరలోనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమమైందని ఆయుష్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

రూ.15 కోట్ల నామ్‌ నిధులు — ముమ్మరంగా టెండర్ల ప్రక్రియ
నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) నిధుల కింద ఈ ఆసుపత్రి నిర్మాణానికి మొత్తం రూ. 15 కోట్లు మంజూరయ్యాయని డాక్టర్ ప్రమీలాదేవి తెలిపారు. అందులో ఇప్పటికే రూ. 7.50 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. స్థల పరిశీలన పూర్తయినందున, సంబంధిత శాఖ ద్వారా వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆయుష్ సీనియర్ వైద్యాధికారులు డాక్టర్ శేఖర్, డాక్టర్ జంగయ్య, డాక్టర్ షఫీ మహమ్మద్, డాక్టర్ సదానందం, డీపీఎం ప్రవీణ్ కుమార్, ఫార్మసిస్టులు రాజేశ్వర్, మునీర్, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.