దేశంలో డెంగ్యూ మహమ్మారి నివారణ దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఫార్మా సంస్థ ‘తకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా’ తయారు చేసిన ‘క్యూడెంగా’ (QDENGA) డెంగ్యూ టీకాకు భారత ల్యాబ్స్ అండ్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ (DCGI) మార్కెట్ అనుమతి మంజూరు చేసింది.
టీకా ప్రత్యేకతలు & అర్హతలు
-
వయోపరిమితి: ఈ టీకాను 4 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు తీసుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.
-
ముందస్తు పరీక్షలు అవసరం లేదు: గతంలో డెంగ్యూ సోకినా, సోకకపోయినా ఈ టీకాను తీసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి ముందస్తు రక్త పరీక్షలు (Pre-vaccination screening) చేయించుకోవాల్సిన అవసరం లేదు.
-
డ్రోస్ పరిమాణం: ఈ టీకాను 3 నెలల వ్యవధిలో రెండు డోసులుగా (ప్రతి డోస్ 0.5 మి.లీ.) చర్మం కింద (Subcutaneous injection) ఇస్తారు.
పరిశోధనలు & రక్షణ
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28,000 మందిపై నిర్వహించిన 19 రకాల క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించిన తర్వాతే భారత్‌లో ఈ టీకాకు అనుమతి ఇచ్చారు. మనదేశంలో నిర్వహించిన ఫేజ్-3 డెన్-302 (DEN-302) ప్రయోగాల ఫలితాలను కూడా DCGI పరిగణనలోకి తీసుకుంది.
ఏడు ఏళ్ల రక్షణ: సుమారు ఏడేళ్ల పాటు సేకరించిన పరిశోధన వివరాల ప్రకారం.. డెంగ్యూలోని నాలుగు రకాల సెరోటైప్‌ల (Serotypes) నుంచి ఈ వ్యాక్సిన్ బలమైన రక్షణ కల్పిస్తుందని, ఆసుపత్రిలో చేరే పరిస్థితిని గణనీయంగా తగ్గిస్తుందని సంస్థ తెలిపింది.
గ్లోబల్ ఆమోదం
2022లో అందుబాటులోకి వచ్చిన క్యూడెంగా టీకాకు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఆమోదం లభించింది. ఇప్పటికే దాదాపు 3.2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత వంటి చర్యలతో పాటు ఈ టీకా అందుబాటులోకి రావడం వల్ల భారతదేశంలో డెంగ్యూ కేసలు తీవ్రతను అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
కింది టైటిల్‌పై క్లిక్ చేసి ఇవి కూడా చదవండి
టైప్-2 డయాబెటిస్ బాధితులకు డెంగ్యూ ముప్పు ఎక్కువ: నిపుణుల హెచ్చరిక
‘మై హ్యుందాయ్’ యాప్‌లో 30,000+ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు: హ్యుందాయ్ మోటార్ ఇండియా భారీ నిర్ణయం!
