బోయినపల్లి: చొప్పదండి నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలను తీరుస్తూ సరికొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామం నుండి కోరెం, వేములవాడ మీదుగా జగిత్యాల వరకు నడిచే ఈ నూతన బస్సు సర్వీసును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ఈ సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.
స్టీరింగ్ పట్టిన ఎమ్మెల్యే.. ఖుషీ అయిన ప్రయాణికులు
బస్సు ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనూహ్యంగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. తానే స్వయంగా బస్సు స్టీరింగ్ పట్టి, కొంత దూరం వాహనాన్ని నడిపించారు. ఎమ్మెల్యే డ్రైవర్ అవతారమెత్తడంతో బస్సులోని ప్రయాణికులు, ఆయన అనుచరులు ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. జనం ఉత్సాహంతో కేరింతలు కొడుతుండగా ఆయన బస్సును ముందుకు నడిపారు. ఈ కొత్త రూట్ వల్ల స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేకూరనుందని అధికారులు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజల రవాణా ఇబ్బందులు తొలగుతాయని, వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ బస్సు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. జగిత్యాల వైపు వెళ్లే ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా అవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
