సోషల్ మీడియాలో టీనేజర్ల భద్రత, వారి స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేందుకు దిగ్గజ సంస్థ ‘మెటా’ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని 52 రాష్ట్రాల అటార్నీ జనరళ్లతో కుదుర్చుకున్న 18 బిలియన్ డాలర్ల చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో 13 నుంచి 17 ఏళ్ల వయస్సు గల యూజర్ల కోసం కొత్త నిబంధనలు తీసొచ్చింది.
కొత్తగా అమలు కానున్న ప్రధాన ఆంక్షలు:
రోజుకు 2 గంటల పరిమితి: టీనేజర్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రెండూ కలిపి రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే వాడగలరు. ఈ సమయం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే యాప్ పనిచేస్తుంది.
నైట్ మోడ్ (రాత్రి 12 నుండి ఉదయం 6): అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫీడ్, స్టోరీలు, రీల్స్ లేదా ఎక్స్‌ప్లోర్ పేజీలు పనిచేయవు. కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు (DM) పంపుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
స్కూల్ మోడ్: పాఠశాల వేళల్లో (ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 వరకు) మెసేజ్‌లు తప్ప మిగిలిన ఎలాంటి నోటిఫికేషన్లు రాకుండా ఆటోమేటిక్‌గా మ్యూట్ అవుతాయి.
స్క్రీన్-టైమ్ హెచ్చరికలు: ప్రతి 15 నిమిషాల నిరంతర వాడకం తర్వాత విరామం తీసుకోమంటూ స్క్రీన్‌పై మెసేజ్ వస్తుంది. 60, 90 నిమిషాలు దాటిన తర్వాత కూడా ప్రత్యేక అలర్ట్‌లు కనిపిస్తాయి.
తల్లిదండ్రులకు విస్తృత అధికారాలు
పిల్లలు కొత్తగా మరో ఖాతా తెరిచినా లేదా అనుమానాస్పద అకౌంట్లతో చాట్ చేసినా తల్లిదండ్రులకు ఆటోమేటిక్‌గా అలర్ట్‌లు వెళ్తాయి. అంతేకాకుండా, అల్గారిథమ్ ఆధారిత ఫీడ్‌ను నిలిపివేయడం, వీడియోల ఆటోప్లే ఆప్షన్‌ను ఆఫ్ చేసే నియంత్రణ అధికారాలు తల్లిదండ్రుల చేతికి రానున్నాయి.
లైక్స్ సంఖ్య లెక్కింపు రద్దు.. ఫిల్టర్లపై నిషేధం
టీనేజర్ల పోస్టులకు వచ్చే లైక్స్, రియాక్షన్ల సంఖ్య ఇతరులకు కనిపించకుండా డిఫాల్ట్‌గా హైడ్ (Hide) అవుతాయి. దీంతో పాటు ప్లాస్టిక్ సర్జరీ, తీవ్రమైన మేకప్‌ను ప్రోత్సహించే ఫేస్ ఫిల్టర్ల వాడకంపై నిషేధం విధించారు. 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తప్పుడు పుట్టిన తేదీతో ఖాతాలు తెరిస్తే వారిని సులభంగా గుర్తించేందుకు కొత్త టెక్నాలజీని మెటా అభివృద్ధి చేస్తోంది.
టిక్‌టాక్, యూట్యూబ్‌లకు పిలుపు
పిల్లల సంక్షేమం కోసం తాము చేపట్టిన ఈ మార్పులను టిక్‌టాక్, యూట్యూబ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లు కూడా వర్తింపజేయాలని మెటా కోరింది. తాము చెల్లించే ఒప్పంద పరిహారంలో 5.3 బిలియన్ డాలర్లు ఇతర ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ భద్రతా నియమాలను అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని మెటా తెలిపింది. రాబోయే 6 నెలల్లో ఈ కొత్త మార్పులు ఆటోమేటిక్‌గా అమలులోకి రానున్నాయి.
