పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా, పూర్తి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ నేపథ్యంలో, ఈ నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ శక్తులు, స్వార్థ ప్రయోజనాలు ఆశించే వర్గాలు కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాలు సేకరించిన సమాచారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాయి.
ఈ సమాచారంపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి, డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
పకడ్బందీ నిర్వహణ & పాదర్శకత
నోటిఫికేషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతను పాటించాలన్నారు.
కఠినమైన సెక్యూరిటీ ప్రోటోకాల్
ప్రశ్నపత్రాల తయారీ, ప్రింటింగ్, పరీక్ష కేంద్రాలకు రవాణా చేసే అన్ని దశల్లో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కోచింగ్ సెంటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక ఇంటెలిజెన్స్ నిఘా ఉంచాలన్నారు. సోషల్ మీడియా మరియు ఇతర సమాచార మాధ్యమాల్లో పరీక్షల నిర్వహణపై ఎలాంటి వదంతులు, దుష్ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వివరించారు.
దళారులు, సైబర్ నేరగాళ్లపై చర్యలు
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై సైబర్ క్రైమ్ విభాగంతో పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు.
పరీక్ష ప్రక్రియ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
సమావేశానికి హాజరైన ప్రముఖులు:
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాస రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న మొదటి 10 దేశాలివే..
రూ. 30,000 లోపు టాప్ AI స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు, బ్యాటరీ వివరాలు ఇక్కడ చూడండి!
టైప్-2 డయాబెటిస్ బాధితులకు డెంగ్యూ ముప్పు ఎక్కువ: నిపుణుల హెచ్చరిక
