- ఏండ్ల క్రితం నుంచే గొడవలు
మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగే హింస దేశం మొత్తాన్ని కుదేపిస్తోంది. రెండు మూడు నెలల క్రితం వరకు మణిపూర్ రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నట్టు తెలిసేది. దేశంలో కొంత మంది వాటిపై నిరసనలు తెలిపేవారు. కానీ 10 రోజుల క్రితం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం అనంతరం వారిపై అత్యాచారం జరిపిన ఒక వీడియో వైరల్ అయ్యింది. రెండు మూడు నెలల క్రితం జరిగిన ఘటనే అయినప్పటికీ అప్పుడు మణిపూర్‌లో ఇంటర్నెట్‌పై నిషేధం ఉండడంతో ఆ ఘటన గురించి బాహ్య ప్రపంచానికి తెలియలేదు. 10 రోజుల క్రితం వీడియో వైరల్‌గా మారడంతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ వేదిక చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు. ఏకంగా ఏన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. సుప్రీం కోర్టు కూడా ఈ అంశంపై తీవ్రంగానే స్పందించి అంత ఘోరమైన ఘటనలు జరగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది.
ప్రధానంగా మూడు వర్గాలు
మణిపూర్ జనాభా సుమారు 35 లక్షల వరకు ఉంటుంది. మణిపూర్లో ప్రధానంగా మూడు వర్గాలు ఉన్నాయి. అవి మైతేలు, కుకీలు, నాగాలు. మణిపూర్ రాష్ట్ర భూ భాగం రెండు భాగాలు ఉంటుంది. కొండ ప్రాంతం, మైదాన ప్రాంతం. కొండ ప్రాంతం ఎక్కువగా, మైదాన ప్రాంతం తక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతంలో కుకీలు, నాగా లు నివాసం ఏర్పరచుకున్నారు. మైతేలు ఎక్కువగా మైదాన ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు.
ఏండ్ల నాటి గొడవలకు కారణం ఇవే..
స్వాతంత్రం వచ్చిన తరువాత కొండ ప్రాంతంలో నివసించే కుకులు నాగాలను గిరిజన జాతుల్లో(ఎస్టీల్లో) చేర్చారు. మైతేలు ఓబీసీ, ఎస్సీలుగా చేర్చారు. సాధారణంగా కొండ ప్రాంతంలో ఉండే గిరిజనులు ప్రత్యేకమైన రక్షణలు కల్పించబడ్డాయి. కొండ ప్రాంతంలోని గిరిజనులకు చెందిన భూమిని అమ్మడానికి, కొనడానికి వీలులేదు. మైతేలు ఉండే మైదాన ప్రాంతాన్ని ఎవరైనా కొనచ్చు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి..
ఇప్పడు..
మైతేలను ఎస్టీల్లో చేర్చే ప్రతిపాదనను పరిశీలించాలని మణిపూర్ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. మిగులు అటవీ భూమిని కూడా లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గొడవలు మరింత ముదిరాయి. తమను అణిచేవేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. మాకు అనాయ్యం జరుగుతోంది మమ్ములను ఎస్టీల్లో జాబితాలో చేర్చాలని మైతేలు నిరసనలు చేపడుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య హింస తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించి సైన్యాన్ని రంగంలోకి దించిన అక్కడ ఇంకా శాంతి నెలకొనడంలేదు.
కొండల్లో విలువైన ప్లాటినమ్ ఖనిజం
మణిపూర్ కొండల్లో విలువైన ప్లాటినం ఖనిజంతో ఇతర ఖనిజాలు ఉన్నాయని ఇందుకోసమే రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించారని దీనంతటికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. అలాంటిదేమీ లేదని శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఈ గొడవలకు నాగా జాతి వారు దూరంగా ఉంటున్నారు.