ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మహబూబాద్ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన తొర్రూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. అడ్డ గూడూరు మండలం చిన్న పడిశాలకు చెందిన చుక్క యాకమ్మ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండా రాములు అడ్డగుడూర్ మండలం కోటమర్తి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గాయపడ్డ వాళ్లను సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం
కామారెడ్డిల్లో టేక్రియాల్ శివారులో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే పలువురు స్వల్పంగా గాయపడగా.. మిగిలినవారంతా సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొంకూరి నర్సయ్యగా గుర్తించారు. కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు.