ఆఫ్రికా దేశం లిబియా.. డేనియల్ తుపాను ప్రభావంతో ఒక్కసారిగా అతలాకుతలమైపోయింది. అక్కడ వరదల ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ జల ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేల వరకు ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో విషయం ఏంటంటే పదివేల మందికి పైగానే ప్రజలు వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియలేదు. అయితే ఈ విషాదానికి సంబంధించి అరేబియా టెలివిజన్‌తో డెర్నా మేయర్ అబ్దుల్‌మేనమ్ మాట్లాడారు. ఈ మహా విపత్తు కారణంగా నగరంలోని మరణాల సంఖ్య 18 వేల నుంచి 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అక్కడి బీచ్ ఒడ్డున ఎక్కడ చూసిన కూడా శవాలు చెల్లాచెదురుగా పడిన దృశ్యాలే కనిపిస్తున్నాయని వాపోయారు. వాటిని చూస్తూంటే ఎంతో బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన శవాలను తగలపెట్టడానికి కూడా స్థలం సరిపోవడం లేదని.. అందుకోసమే సామూహిక ఖననం చేస్తున్నామని పేర్కొన్నారు. వరద వచ్చిన సమయంలో చాలామంది నిద్రలో ఉన్నారని. అలా నిద్రలోనే జల సమాధి అయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు డెర్నా నగరంలోని రహదారులన్నీ కొట్టుకుపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ జల ప్రళయానికి గాయపడిన వారికి కూడా చికిత్స అందించేందుకు ఆలస్యం జరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా లిబియాకు అల్జీరియా, తుర్కియే, యూఏఈ, ఈజిప్ట్, టునీసియా దేశాలు తమ సహాయక బృందాలను అలాగే ఔషధాలను పంపించాయి. అలాగే ఈ విపత్తులో అతలాకుతలమైన లిబియాకు సాయం కోసం అత్యవసర నిధులు పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి డేనియల్ తుఫాన్ లిబియా తీర ప్రాంతాన్ని తాకింది. అయితే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ తుఫాన్ తీవ్రతరైంది. దీనివల్ల అక్కడ ఆకస్మిక వరదలు వచ్చేశాయి. వరదల ప్రబావానికి ఏకంగా రెండు డ్యాములు కొట్టుకుపోయాయి. అంటే ఈ జల విలయం ఏ స్థాయిలో జరిగిందో అర్థం అవుతుంది. అయితే ఈ డ్యాములు ధ్వంసం అయిన తర్వాత అక్కడ్నుంచి పోటెత్తిన వరద వల్ల అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. ఇక ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా పట్టణం ఈ వరదలకు తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆ నగరంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోయాయి. అక్కడ వీధుల్లో, అపార్టుమెంట్లతో పాటు రోడ్లపైకి ఎక్కడ చూసినా కూడా శవాలు గుట్టలుగుట్టలుగా పడి ఉండటం కలకలం రేపింది. ఈ వరద ధాటికి ఎక్కడికక్కడ కొట్టుకుపోయారు. దీంతో ఈ మతుల సంఖ్య రోజురోజుకు పెరగడం మరింత ఆందోళన పెంచుతోంది.