అలుముకున్న దట్టమైన పొగలు
ప్రాణభయంతో బయటకు పరుగురులు తీసిన రోగులు
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో స్వల్ప అగ్నిప్రమాదం సోమవారం చోటుచేసుకుంది. ప్రసూతి వార్డులోని స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన బ్లీచింగ్ పౌడర్, యాసిడ్స్, పలు శానిటరీ సామగ్రికి మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అందులోని రోగులు ప్రాణభయంతో బయటకు పరుగురు తీశారు. మాతా-శిశు కేంద్రం కావడంతో చిన్న పిల్లలు, బాలింతలు ఉండగా.. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి అందరినీ బయటకు తరలించారు. అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ముందుగా దట్టమైన పొగలు బయటకు వెళ్లేలా కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆపై మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో యధావిధిగా వైద్య సేవలు అందిస్తున్నారు. ‘ఇవాళ ఉదయం మేమంతా మా పనుల్లో ఉన్నాం. పిల్లలు నిద్రపోతున్నారు. మేం అప్పుడే మెలకువ రావడంతో లేచి ఫ్రెషప్ అవుదామనుకుంటున్నాం. ఇంతలోనే వార్డుల్లో అరుపులు వినిపించాయి. మంటలు.. మంటలు అంటూ అంతా అరవడంతో ఏం జరుగుతుందో కాసేపటి వరకు అర్థం కాలేదు. అగ్ని ప్రమాదం జరిగిందని అర్థమవ్వగానే.. మా పిల్లలను తీసుకుని బయటకు వెళ్లాం. కానీ అప్పటికే వార్డులన్నింటిలో పొగ వ్యాపించింది. ఈ పొగ వల్ల పిల్లలు కాస్త అస్వస్థతకు గురయ్యారు. పొగ గొంతులోకి వెళ్లి మంట పుడుతోంది. సిబ్బంది అప్రమత్తమై కిటికీల అద్దాలు పగులగొట్టడం కాస్త ఉపశమనాన్నిచ్చింది. అగ్ని ప్రమాదాలపై ఫైర్ సిబ్బంది ఎంత అవగాహన కల్పిస్తున్నా.. వారోత్సవాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నా.. ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వివిధ కారణాలతో వీటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో మనుషుల ప్రాణాలు పోతున్నాయి. భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాల సమయాల్లో ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించకపోవడమూ ఈ అగ్ని ప్రమాదాలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. వాటిని నిరంతరం కొనసాగించడంలో విఫలం అవుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే కొద్ది రోజులు హడావిడి చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమూ మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా అధికారులు, ప్రజలు ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయాక మేల్కొని బాధ్యులను శిక్షించడం కంటే.. ముందుగానే అప్రమత్తమై బాధితులను రక్షించడం మేలని సూచిస్తున్నారు.
చదవండి ఇవి కూడా