కడెం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. సాగు, తాగు నీరందించే ప్రాజెక్టుగానే కాకుండా పర్యాటకంగానూ పేరొందింది. నిర్మల్ జిల్లాలోని పెద్దూరు మండలంలోని కడెం నదిపై 1949లో ఈ డ్యాం నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. కాగా1958 నుంచి పనులు ప్రారంభమయ్యాయి.. 1959 లో కడెంపై నదిపై అంచనాకు మించి వరద రావడంతో ముందుగా అనుకున్న గేట్లకు మరో 9 గేట్లు అమర్చారు. 1969లో మొత్తంగా 18 గేట్లతో పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టు 3 లక్షల క్యూసెక్కులు నీటి విడుదల సామర్థ్యం కాగా పోయిన ఏడాది ఏకంగా 5.20 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ప్రాజెక్టు తెగిపోతుందని కూడా పుకార్లు పుట్టాయి. అధికార యంత్రాంగం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. అదృష్టవశాత్తు ఆ గండం నుంచి తప్పించుకోగలిగాం. మళ్లీ ఈ ఏడాది 3.20 లక్షల క్యూసెక్కుల వరద భయపెట్టింది. ఈ క్రమంలో గేట్లు కూడా తెరుచుకోకపోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఈ సారి కూడా బయటపడ్డాం. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.60 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.60 టీఎంసీలను వినియోగించుకునే పరిస్థితి ఏర్పడింది. డ్యాంను నిర్మించి 65 ఏండ్లు దాటడంతో ఆ ప్రాజెక్టు భద్రమా..? కాదా… అన్న దానిపై కేంద్ర అధికార బృందం, డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆఫీసర్లు ప్రాజెక్టును సందర్శించారు. ఈ బృందం ప్రాజెక్టు యొక్క స్థితిగతులను అధ్యయనం చేయనుంది. ప్రాజెక్టు మ్యాప్‌ను, రెండు సంవత్సరాలలో జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. వరద గేట్లు, గేట్ల కౌంటర్ వెయిట్లు, రూప్స్, అదనపు స్పిల్‌వే సామర్థ్యం,ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో, గేట్ల విడుదల రూపకల్పన, లోడ్ డిశ్చార్జ్, కాలువ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించారు. పలు సమస్యలపై చర్చించారు. ప్రధాన స్పిల్ వేను తిరిగి నిర్మించాలని కేంద్ర బృందం సూచించింది.