ఇండియాకు వెళ్లిపోవాలని కెనడాలోని భారతీయ హిందువులను ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరించాడు. కెనడా పట్ల, ఆ దేశ రాజ్యాంగం పట్ల విధేయతను భారతీయ హిందువులు తిరస్కరించారని నిషేధిత ఖలిస్థాన్ అనుకూల గ్రూప్, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) నాయకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆరోపించాడు. ఖలిస్థాన్ అనుకూల సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారని తెలిపాడు. అలాగే వారు ఎప్పుడూ కెనడా వైపు ఉంటారని, ఎల్లప్పుడూ ఆ దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని సమర్థించారని చెప్పాడు. ‘విూ గమ్యం భారత్. కెనడా వదిలి భారతదేశానికి వెళ్ళండి’ అని కెనడాలోని భారతీయ హిందువులును తాజా వీడియోలో బెదిరించాడు.కాగా, జూన్‌లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని, నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆరోపించారు. భారత్‌ను రెచ్చగొట్టడం లేదన్న ఆయన, నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.మరోవైపు జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్య అధికారులను బహిష్కరించాయి. అయితే కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. అలాగే కెనడాలోని భారతీయులు, విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం సూచన జారీ చేసింది.
చదవండి ఇవి కూడా