కరీంనగర్ టౌన్
గల్ఫ్ బాధిత కుటుంబానికి మా ఊరి మహాలక్ష్మి పౌండేష్ వారు అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన పిట్టల వెంకటేష్ ముదిరాజ్ బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే అనారోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అటు అనారోగ్యం ఇటు అప్పుల బాధకు మనో వేదను గురయి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు కూతుర్లు. మృతుడి భార్య కవిత బీడిలు చేసుకుంటు ముగ్గురు కూతుర్లను సాదుకుంటుంది. పేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ వారు కరీంనగర్ నగరానికి చెందిన తాడెం శ్రీనివాస్ మంజుల దంపతుల సహాకారంతో ముగ్గురు ఆడపిల్లల నిత్యశ్రీ (9) నితిక (4) మను శ్రీ (2)ల పేరిట ఒక్కొక్కరికి రూ. 10 వేల 116 చొప్పున మొత్తం రూ. 30వేల 348 కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమద్ధి యోజన పథకంలో డిపాజిట్ చేశారు.
ఈ మేరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ పేపర్ ను ఎంపీపీ తోట నారాయణ, వెంకటపూర్ సర్పంచ్ తోట శారద లింగారెడ్డి చేతుల మీదుగా పిల్లల తల్లి కవితకు ఆదివారం అందజేశారు. అనంతరం మృతుడి భార్య కవిత మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ వారికి, సహాయం చేసిన తాడెం మంజుల శ్రీనివాస్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.