రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన సంజూష్.. అసలు ఏం జరిగిందో వెల్లడి!
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చానన్న ఎంపీ లింగమనేని కుమారుడు
హైదరాబాద్, ఆగస్టు 21: రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై స్పష్టత ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించానని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతి ముఖికి తక్షణమే వైద్య సహాయం అందించేందుకు తన సొంత వాహనంలోనే ఆస్పత్రికి తరలించినట్లు సంజూష్ తెలిపారు. వైద్య సహాయం అందించేందుకు తన వంతు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు తాను తీసుకున్న చర్యలను వాస్తవ పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
స్వయంగా పోలీస్ స్టేషన్‌కు హాజరు
ఆస్పత్రికి తరలించిన అనంతరం తాను ఎక్కడికీ వెళ్లిపోకుండా స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, జరిగిన ఘటన వివరాలను పోలీసు అధికారులకు వివరించానని తెలిపారు. కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులకు సంపూర్ణంగా సహకరించానని చెప్పారు.
మూడు వైద్య పరీక్షల్లోనూ ‘నెగెటివ్’
ప్రమాద సమయంలో తాను మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించానా అనే కోణంలో పోలీసులు నిర్వహించిన మూడు కీలక వైద్య పరీక్షల ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని వెల్లడించారు. బ్రీత్ అనలైజర్, యూరిన్ టెస్ట్, మరియు బ్లడ్ టెస్ట్ నివేదికల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఈ దురదృష్టకర సంఘటనలో భారతి ముఖి కన్నుమూయడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన వాస్తవ పరిస్థితులు, ఆస్పత్రికి తరలించిన తీరు, పోలీసులకు అందించిన సహకారం మరియు మెడికల్ రిపోర్టులను ఆధారంగా చేసుకుని నిష్పక్షపాతంగా అంచనా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్నిసంజూష్ ఖండించారు. సోషల్ మీడియాలో పోస్టులు వేసేవారు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.
శరీరంలో నిద్రపోతుంది.. క్యాన్సర్ కణం చూడగానే దాడి చేస్తుంది! భారత శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం!
