అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి నాగపూర్ సిటీ నీట మునిగింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఏకంగా 106 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షానికి నాగ్‌పూర్‌ని వరద ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవేశించి కాలనీలన్నీ నీట మునిగాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భారీ వర్షం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు తాజా పరిస్థితిని సవిూక్షిస్తున్నట్టు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా అంబజారి సరస్సు పొంగిపొర్లుతున్నట్లు తెలిపారు. దీంతో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమైనట్లు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సహా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు వరద సహాయక చర్యల కోసం నగరంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు మోహరించారు. వరదల్లో చిక్కుకుపోయిన 25 మందిని ఇప్పటి వరకు రక్షించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. మరోవైపు నాగ్‌పూర్, భండారా, గోండియా, వార్ధా, చంద్రపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అమరావతి, యవత్మాల్, గడ్చిరోలిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారత్ వేదికగా ప్రపంచ సమరం..