దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’ వివాదంలో పడింది. నిన్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ కూడా తెచ్చుకుంది. అయితే ఆ తరువాత బయటకి కథ లీక్ అయినట్టుగా కనపడుతోంది. అందుకే ఈ సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల ‘కీర్తి కిరీటాలు’ ఆధారంగా నిర్మించిందని ఒక వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఆ నవల ఆధారంగా తీసింది అయితే, మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ నవలా రచయిత అయిన యద్దనపూడికి క్రెడిట్ ఇస్తారా అని కూడా వార్త నడుస్తోంది. ఎందుకో ఈ ‘గుంటూరు కారం’ మొదటినుండీ వివాదాల్లోనే వుంది. సినిమా అనుకున్న విధంగా మొదలవకపోవటం, మధ్యలో షూటింగ్ డిలే అవటం, ఆ తరువాత పాటల వివాదం, ఇప్పుడు మళ్ళీ ‘కీర్తి కిరీటాలు’ నవల ఆధారంగా తీశారన్న ఈ వివాదం. ఇంతకు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ.. ఆ… ‘ అన్న సినిమా కూడా తీశారు. అందులో నితిన్, సమంత జంటగా నటించారు. ఆ సినిమా కూడా యద్దనపూడి సులోచనారాణి నవల ‘విూనా’ ఆధారంగా తీసిన సినిమా. అదే నవలని కొన్ని దశాబ్దాల కిందట విజయనిర్మల దర్శకత్వంలో, కృష్ణ, విజయనిర్మల జంటగా ‘విూనా’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది. అయితే త్రివిక్రమ్ ‘అ.. ఆ… ‘ సినిమాగా అదే నవలని తీసినప్పుడు యద్దనపూడికి క్రెడిట్ ఇవ్వలేదు. అందరూ విమర్శించాక విడుదలైన కొన్ని రోజుల తరువాత ఆమె పేరు పెట్టి ఆమెకి క్రెడిట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ‘గుంటూరు కారం’ నిజంగానే యద్దనపూడి ‘కీర్తి కిరీటాలు’ నవల ఆధారంగా తీసిన సినిమా అయితే ఆమెకి క్రెడిట్ ఇస్తారా? ఆ నవల, ‘గుంటూరు కారం’ కథ ఒకటేనా కాదా అన్నది సినిమా విడుదలైన తరువాత కానీ తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి. త్రివిక్రమ్ నిజంగానే ‘కీర్తి కిరీటాలు’ నవల ‘గుంటూరు కారం’ సినిమాగా మలిస్తే మాత్రం, మహేష్ బాబుకి పెద్ద విజయం వచ్చినట్టే. ఎందుకంటే ఆ నవల చాలా బాగుంటుంది, అవార్డు కూడా వచ్చింది ఆ నవలకి, అందులో తల్లి సెంటిమెంట్ తో పాటు చాలా భావోద్వేగాలు ఉంటాయి. అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన నవల అది. ఇంకో ఆసక్తికరం అంశం ఏంటంటే నవల రచయిత యద్దనపూడి సులోచనారాణి ఇప్పుడు లేరు, ఆమె ఐదు సంవత్సరాల క్రితమే కన్నుమూశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత
ప్రపంచంలోనే మొదటి ట్రైన్ పబ్.. వీడియో వైరల్