Khaidi 2″ ఖైదీ 2 సంగీతానికి అనిరుధ్ – అభిమానుల్లో మిశ్రమ స్పందనలు

Khaidi 2″  తమిళ నటుడు కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో 2019లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’ భారీ విజయాన్ని సాధించింది. పాటలు లేకుండానే ప్రేక్షకులను సీటుకు అతికించి పెట్టిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సామ్ C.S. అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటికే ఖైదీకి సీక్వెల్ రాబోతోందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం రజనీకాంత్‌తో చేస్తున్న ‘కూలీ’ చిత్రం తర్వాత ‘ఖైదీ 2’ పనులు ప్రారంభమవుతాయని వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అందులో ఆయన, “నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు అనిరుధ్. ఇక నుంచి నేను చేసే ప్రతీ సినిమాలో అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకుంటాను. ఆయన రిటైరయ్యేంతవరకూ వేరే ఎవరి తోనూ పని చేయను,” అని చెప్పడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.

ఇందుకు కారణం – మొదటి భాగానికి సంగీతం అందించిన సామ్ C.S. క్రియేట్ చేసిన మ్యూజిక్‌కి అప్పట్లో మంచి రెస్పాన్స్ రావడం. ముఖ్యంగా కథానాయకుడు కార్తీ బిర్యానీ తినే సీన్‌లో వచ్చే బీజీఎం ఇంకా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో, ఖైదీ 2కి కూడా అదే స్థాయి మ్యూజిక్ రావాలన్నది ప్రేక్షకుల ఆశ.

అనిరుధ్‌ ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఖైదీ స్థాయిలో బీజీఎం ఇవ్వగలరా? అనే సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. మరోవైపు, లోకేష్ ప్రస్తుతం కమల్ హాసన్, రజనీకాంత్‌లతో ఒక మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో ‘ఖైదీ 2’ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏదేమైనా, ఖైదీ 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది? దానికి సంగీతం ఎలా ఉంటుందన్నదే అభిమానుల ఆతృతగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *