బీడ్ (మహారాష్ట్ర) పరిధిలోని గాయానగర్ ప్రాంతంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గురుకుల్ పబ్లిక్ స్కూల్ సమీపంలో స్కూల్ బస్సు దిగి రోడ్డు దాటుతున్న 9 ఏళ్ల బాలికను అతివేగంగా వచ్చిన ఒక టూ వీలర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ విద్యార్థుల భద్రతపై ఈ ఘటన మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.
⚠️ Accident/Sensitive video
దయచేసి మీ పిల్లలకు Roadsense నేర్పియండి.
ఎప్పుడు రోడ్డు దాటాలి,
ఎటువైపు నడవాలి,
అడ్డుగా ఉంటే ఎలా దాటాలి.అది తల్లిదండ్రుల బాధ్యత కూడా, అంత అయ్యాక చేసేది ఏమి ఉండదు 🙏🙏🙏#Roadsafety #Accident #Childsafety #Rqodsense pic.twitter.com/3CG16stSJk
— ముచ్చట్లు (@muchatlu_) June 28, 2026
అసలేం జరిగిందంటే..?
గాయానగర్ నివాసి అయిన అభిజీత్ మడివాలే (9) అనే విద్యార్థిని ఎప్పటిలాగే శనివారం స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వచ్చింది. బస్సు స్టాప్ వద్ద ఆగడంతో ఆ చిన్నారి కిందకు దిగి, రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా రోడ్డుపై అతివేగంగా దూసుకొచ్చిన ఒక మోటార్ సైకిల్ ఆ బాలికను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పాఠశాల సిబ్బంది స్పందించి ఆ చిన్నారిని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ బాలికకు అత్యవసర చికిత్స నడుస్తోంది.
యాజమాన్యానిదే బాధ్యత: పోలీస్ ఇన్స్పెక్టర్
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ విభాగం మరియు స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ ఇన్స్పెక్టర్ వైభవ్ పాటిల్ మాట్లాడుతూ.. విద్యార్థులను సురక్షితంగా దించి, వారు రోడ్డు దాటే వరకు చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత స్కూల్ బస్సు డ్రైవర్ మరియు పాఠశాల యాజమాన్యానిదేనని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా అన్ని పాఠశాలలకు నోటీసులు పంపుతామని, త్వరలోనే స్కూల్ మేనేజ్మెంట్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సోషల్ మీడియా (X) లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ఈ ఘటనపై సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ‘X’ (ట్విట్టర్) లో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారతదేశంలో స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని మండిపడుతున్నారు.
రోడ్డు భద్రతా నిపుణుల అభిప్రాయం: “మన దేశంలో స్కూల్ బస్సు ఆగినప్పుడు వెనకాల వచ్చే వాహనాలు అస్సలు ఆగవు. పిల్లలు రోడ్డు దాటాలంటే బస్సు పూర్తిగా వెళ్ళిపోయే వరకు వేచి చూడటమే సురక్షితం” అని ఒక యూజర్ పేర్కొన్నారు.
విదేశీ చట్టాల ప్రస్తావన: “యూఏఈ (UAE) లేదా ఇతర విదేశాల్లో స్కూల్ బస్సు ఆగి పిల్లలను దించుతున్నప్పుడు.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలు కచ్చితంగా ఆగిపోవాలి. అలా చేయకపోతే భారీ జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. మన దేశంలో కూడా ఇలాంటి కఠిన చట్టాలు తేవాలి” అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
