కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘోర ఘటన వెలుగుచూసింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఓ కూలి మహిళను నమ్మించి, ఆమె వద్ద ఉన్న బంగారాన్ని లాక్కొని, ఏకంగా బావిలోకి నెట్టేసిన దారుణ ఉదంతం నుస్తులాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
లేబర్ అడ్డా వద్ద ఉచ్చు..
కరీంనగర్ నగరంలోని కిసాన్‌నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ రోజువారీ కూలి పనుల కోసం బుధవారం ఉదయం స్థానిక లేబర్ అడ్డా వద్ద వేచి ఉంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, ఆమెకు పని ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన లక్ష్మి, ఆ వ్యక్తితో కలిసి బయలుదేరింది.
అయితే ఆ దుండగుడు ఆమెను తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. మహిళను బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా, తమ దొంగతనం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఆమెను సమీపంలో ఉన్న ఒక బావిలోకి నెట్టేసి అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యాడు.
24 గంటల పాటు బావిలోనే ..
బావిలో పడిపోయిన లక్ష్మికి అదృష్టవశాత్తు ఈత రావడం ఆమె ప్రాణాలను కాపాడింది. బావి లోపల నీటిలో ఒక చిన్న ఆధారం దొరకడంతో, దాన్ని గట్టిగా పట్టుకుని రాత్రంతా ప్రాణ భయంతో అల్లాడిపోయింది. దాదాపు 24 గంటలకు పైగా ఆమె బావిలోనే మృత్యువుతో పోరాటం చేసింది.
రక్షించిన బావి యజమాని..
గురువారం ఉదయం బావి వద్దకు వచ్చిన యజమానికి, లోపల నుండి మహిళ అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో ఆయన వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల స్థానికులకు విషయం చెప్పాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తిమ్మాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్థానికులు తాళ్లు, మంచం సహాయంతో తీవ్రంగా శ్రమించి ఆ మహిళను బావిలోంచి సురక్షితంగా బయటకు తీశారు.
ఆసుపత్రికి తరలింపు – పోలీసుల గాలింపు
రోజంతా నీటిలోనే ఉండిపోవడం, ప్రాణభయంతో కొట్టుమిట్టాడటంతో లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆమెను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై తిమ్మాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
