తీసుకున్న అప్పును ఎగ్గొట్టేందుకు తిరిగే ఈ రోజుల్లో, ఎప్పుడో పాతికేళ్ల క్రితం నాటి రుణాన్ని తీర్చేందుకు ఓ వ్యక్తి ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన అరుదైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలుగుచూసింది. పాత స్నేహాన్ని గుర్తుపెట్టుకుని మరీ వచ్చి అప్పు చెల్లించిన ఆ మిత్రుడి నిజాయితీ స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సౌదీలో మొదలైన స్నేహం.. కష్టకాలంలో సాయం
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న దాదాపు 25 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని ఒకే కంపెనీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో ఇస్మాయిల్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో, రూమ్‌మేట్ మరియు మిత్రుడైన లచ్చన్న కొంత డబ్బును అప్పుగా ఇచ్చి ఆదుకున్నారు. భారతదేశానికి వెళ్లాక ఆ డబ్బు తిరిగి ఇస్తానని ఇస్మాయిల్ మాట ఇచ్చారు. అయితే, స్వదేశానికి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇస్మాయిల్ ఆ అప్పును సకాలంలో తీర్చలేకపోయారు.
గూగుల్ సర్చ్ సాయంతో ధర్మపురికి..
ఏళ్లు గడిచినా మిత్రుడికి ఇవ్వాల్సిన అప్పు విషయం ఇస్మాయిల్ మనసును తొలిచేస్తూనే ఉంది. ఎలాగైనా రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న ఆయనకు లచ్చన్న పూర్తి చిరునామా గానీ, ఫోన్ నెంబర్ గానీ అందుబాటులో లేదు. కేవలం లచ్చన్నది తెలంగాణలోని ‘ధర్మపురి’ అనే ఒకే ఒక్క జ్ఞాపకం మిగిలింది. దాని ఆధారంగానే ఇస్మాయిల్ గూగుల్ మ్యాప్స్ సాయంతో వెతుక్కుంటూ ధర్మపురి పట్టణానికి చేరుకున్నారు. అక్కడ స్థానికులను అడుగుతూ ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం లచ్చన్న ఇంటిని కనుగొన్నారు.
గల్ఫ్‌లో ఉన్న మిత్రుడితో ఫోన్ కాల్.. భావోద్వేగం
అప్పు తీర్చడానికి కేరళ నుండి ఇంత దూరం వచ్చానని చెప్పడంతో లచ్చన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం గల్ఫ్ దేశంలో ఉన్న లచ్చన్నకు ఫోన్ చేసి మాట్లాడించగా.. తాను అప్పు ఇచ్చిన విషయమే లచ్చన్న మర్చిపోయినట్లు చెప్పారు. కానీ, తన పాత స్నేహితుడు ఇస్మాయిల్‌ను మాత్రం వెంటనే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరూ పాత రోజులను గుర్తుచేసుకుని కాసేపు ముచ్చటించారు.
అనంతరం ఇస్మాయిల్ రూ.25 వేల నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇన్నేళ్లుగా తన మనసులో దాగి ఉన్న రుణభారం ఇన్నాళ్లకు తొలగిపోయిందని చెబుతూ ఇస్మాయిల్ భావోద్వేగానికి గురయ్యారు.
