Karimnagar “ఇసుక లారీ అజాగ్రత్త.. టీజీఎస్‌ఆర్‌టీసీ బస్ డ్రైవర్ చాకచక్యంతో తప్పిన భారీ ప్రమాదం

Karimnagar ” 70 మంది ప్రయాణికులు సురక్షితం

కరీంనగర్, శంకరపట్నం:
ఇసుక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జాతీయ రహదారిపై భారీ ప్రమాదం చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) బస్ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఈ ఘటన శనివారం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గం వీరవంక మండలం పోతిరెడ్డి పల్లె నుంచి ఇసుక లోడ్‌తో సిద్దిపేటకు వెళ్తున్న లారీ, మూలమలుపు వద్ద డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఎదురుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది.

కరీంనగర్ నుంచి యూరియా లోడ్‌తో తాడికల్ పీఏసీఎస్ పరిధిలోని కరీంపేట గ్రామానికి వెళ్తున్న యూరియా లారీ ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతింది. అదే సమయంలో కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఘటనను గమనించిన డ్రైవర్ శ్రీకాంత్ వెంటనే అప్రమత్తమై బస్సును నియంత్రించి రోడ్డు పక్కకు మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది.

బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన ఇసుక లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు మరియు స్థానికులు డిమాండ్ చేశారు.

////////////////////////////////////////////////////

అండర్ పాస్ నిర్మాణం చేయాలి…
నిరసన వ్యక్తం చేసిన కొత్తగట్టు, గొల్ల పల్లె గ్రామస్తులు….

 శంకరపట్నం:
ఎన్ హెచ్ 563 జాతీయ రహదారి పైన కొత్తగట్టు, గొల్లపల్లె మధ్యలో అండర్ పాస్ నిర్మాణం చేయాలని, గ్రామస్తులు పనులు నిలిపివేసి శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకర పట్నం మండలంలోని కొత్తగట్టు, గొల్ల పల్లె నేను గ్రామాల్లో ఎన్ హెచ్ 563 జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందని, జాతీయ రహదారి నిర్మాణంలో గొల్లపల్లె కొత్తగట్టు గ్రామాలకు జాతీయ రహదారి నుండి గ్రామంలోకి వెళ్లడానికి ప్రయాణం చేయాలంటే, తీవ్ర ఇబ్బందులు ప్రజలకు ఏర్పడి ప్రమాదం ఉందని, జాతీయ రహదారి నిర్మాణంలో కొత్తగట్టు ,గొల్లపల్లె ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు, వినతి పత్రాలు అందజేశామని, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని, జాతీయ రహదారి నిర్మాణం పనులను అడ్డుకొని, రెండు గ్రామాల ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు జాతీయ రహదారి పైన అండర్ పాస్ నిర్మాణం చేయాలని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగట్టు గ్రామ ఉపసర్పంచ్ వంగల వీరేందర్ రెడ్డి, గొల్లపల్లి ఉపసర్పంచ్ బాగోతం కుమార్, మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యులు తాడిచర్ల తిరుపతి, బి సి ఆర్ఎస్, బిజెపి నాయకులు, ఉమ్మెత్తల సతీష్ రెడ్డి, సాగి భద్ర రావు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *