కొద్ది మంది నేతలు బీజేపీని వీడుతున్నట్టు ప్రచారం..
చంద్రశేఖర్ బాటలో మరికొందరు..?
కొన్ని నెలల కిందటి వరకు తెలంగాణాలో ఊపుమీద ఉన్న బీజేపీ ఇప్పుడెందుకో డీలా పడింది. తెలంగాణాలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఆ తర్వాత బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షడయ్యాక దూకుడు మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని యువతలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న బండికి అది కలిసొచ్చింది. దాదాపు మూడున్నర ఏండ్లు సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అరెస్ట్ లు , ధర్నాలు, విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవారు. ఒక్క బండి సంజయే కాదు.. ఆ పార్టీ నాయకులందరూ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఏకి పారేసేవారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘనందర్‌రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. కానీ కర్ణాటక ఎన్నికల అనంతరం ఆ సీన్ మారిపోయింది. కవిత అరెస్ట్ అవుతుందని బీజేపీ అనుకూల వర్గాలు భావించాయి. అది కూడా జరగపోవడంతో బీజేపీపై కొంత అసంతృప్తిని రగిల్చింది. బీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ మస్తు ఊపుమీదికొచ్చింది. అంతలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చారు. కేంద్ర మంత్రి బీజేపీలో సీనియర్ నాయకుడు, గతంలోనూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉండడంతో కిషన్‌రెడ్డికి అప్పజెప్పారు. కిషన్ రెడ్డి సీనియర్ నాయకుడు కావడంతో బీజేపీ మరింత బలపడుతుందని అందరూ భావించారు. కానీ ఆపరిస్థితి కనబడడం లేదు. బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్, బీజేపీ ప్రతికూల వర్గాలు ప్రచారం చేస్తుండడంతో అనేక మంది నాయకులు బిజెపిని వీడుతున్నారు. ఇటీవల మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్ బిజెపి వీడి కాంగ్రెస్‌లో చేరబోతు న్నారు. ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీని వీడుతారని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇదే క్రమంలో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కిషన్‌రెడ్డి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహంచారు. దీంతో మళ్లీ కొంత బీజేపీకి సానుకూలత పెరుగుతోంది. ఈ క్రమంలోనే సినినటీ, మాజీ కాంగ్రెస్ నాయకురాలు జయసుధ బిజెపిలో చేరారు. మరింత మందిని బీజేపీలో చేర్చుకుని ఎన్నికల్లోకి వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. తదనుగుణంగా కిషన్‌రెడ్డితో పాటు, బండి సంజయ్, ఈటల రాజందర్, ఇంకా ముఖ్యమైన నాయకులను ప్రచార రంగంలోకి దించాలని కేంద్ర భావిస్తున్నట్టు సమాచారం..