తెలంగాణాలో కొత్త సర్కారు కొలువుదీరిన తరువాత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం మహాలక్ష్మి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్ జెండర్ కు ఉచిత ప్రయాణాలను కల్పించారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణించే పురుషులకు సీట్లు దొరకడం లేదని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్న క్రమంలో కొన్ని సమస్యలు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా మహిళ ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నారని తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని తెలిపారు. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని స్పష్టం చేశారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 23, 2023
బావా నువ్వు కూసో.. నేను నడుపుతా.. ఒకే కారులో మాజీ మంత్రులు
కొత్త రేషన్ కార్డులు, మార్పులు చేర్పులు ప్రక్రియ28 నుంచి..?