- తిరుమల నడకదారిలో మరో విషాదం
- రాత్రి అదృశ్యం..పొద్దన్న శవం దర్శనం
తిరుమల, ఆగస్ట్12 అలిపిరి నడకదారిలో మరోసారి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సమయంలో తప్పిపోయిన చిన్నారి శనివారం ఉదయం మృతి చెంది కనిపించింది. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన లక్షిత తన కుటుంబ సభ్యలతో రాత్రి నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. ఈ క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో లక్షిత తప్పిపోయింది. కుటుంబ సభ్యులు 10 గంటల వరకూ వెతికారు. ఎక్కడ కనపడకపోవడంతో పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో లక్షిత మృతదేహం లభించింది. శరీరం పై గాయాలు ఉంన్నాయి. దీంతో పాపను చిరుత చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే చిన్నారి కూడా తప్పిపోవడం గమనార్హం. పాపను చంపి తిన్నది చిరుత కాదని ఎలుగుబంటి అయి ఉండొచ్చని డీఎఫ్‌వో సతీష్ మొదట అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతిలో రుయా ఆస్పత్రి మార్చురీ వద్ద పాప మృతదేహాన్ని చూశారు. అనంతరం డీఎఫ్‌ఓ విూడియాతో మాట్లాడుతూ. చిరుత అయితే లోతైన గాయాలు అయ్యేవి అనిపిస్తోందని చెప్పారు. పోస్టుమార్టం పూర్తయితే ఏ జంతువు దాడి చేసింది అని స్పష్టం అవుతుందన్నారు. టీటీడీ డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతూ… పాప జుట్టును పెరికిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అలాగే ముఖం పైన ఉన్న చర్మాన్ని పూర్తిగా తినేసిన ఆనవాళ్లు కనిపిస్తోందని చెప్పారు. చిరుత పులి అయితే ఇలా దాడి చేయదన్నారు. నడక దారిలో గుంపులు గుంపులుగా వెళ్లడం శ్రేయస్కరమని శ్రీనివాస్ వెల్లడించారు.
- బాలికను చంపిందే చిరుతే
- పోస్ట్ మార్టమ్ నివేదిక వెల్లడి
- నడకదారిలో నిఘా పెంచుతామన్న టిటిడి
తిరుపతి నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిని హతమార్చింది చిరుతేనని తేలింది. ఈ ఘటన తెలుగు రాష్టాల్ల్రో సంచలనంగా మారింది. నడకదారిలో పాపపై దాడి చేసింది చిరుత పులేనని పోస్టుమార్టంలో తెలిసింది. ఎస్వీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం లక్షితను చంపేసింది చిరుతేనని తేల్చింది. రాత్రి చంపి శరీరంలోని భాగాలను చిరుత తిని వెళ్లిపోయిందని పోస్టుమార్టంలో తేలింది. ఆ తర్వాత రాత్రంతా ఉన్న శవాన్ని మరేదైనా జంతువు తిని ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. పాప ప్రాణం పోవడానికి మాత్రం చిరుతే కారణమని స్పష్టం చేశారు.