పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చులు రేపుతున్నాయి.. క్షణిక సుఖాల కోసం తమవారిని సైతం దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా వారు జైలు పాలు కాగా, వారి పిల్లలు అనాథలవుతున్నారు. సూర్యపేటలో జరిగిన రియల్ మర్డర్స్ ఓ క్రైం కథ సినిమాను తలింపించేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేట జిల్లా మోతే మండలం బళ్లుతండాకు చెందిన భూక్యా వెంకన్న భార్యా పిల్లలతో సూర్యాపేట భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నాడు. ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన షేక్ రఫీ తన కుటుంబంతో సూర్యపేటలోని శ్రీరాంనగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో వెంకన్నకు రఫీ భార్య నస్రీన్‌తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కలిసి జీవించాలని ఇద్దరు అనుకున్నారు. వారి భాగస్వాములు అడ్డుగా ఉన్నారని భావించారు. వారిని అడ్డులేకుండా చేస్తే తమకుఏ ఇబ్బంది ఉండదని భావించారు. అందుకు అనుగుణంగా వెంకన్న అత్యంత దారుణంగా ఆలోచించాడు. ఈ ఏడాది జూన్ 8న తన భార్యతో వెంకన్న ద్విచక్రవాహనంపై బళ్లుతండా నుంచి సూర్యపేటకు వెళ్లాడు. వెళ్తున్న క్రమంలో మధ్యలో వాహనం ఆపి తన భార్య తలను కరెంటు స్తంభానికి దారుణంగా కొట్టి చంపాడు. అతను కూడా కాళ్లు చేతుల మీద దెబ్బలు తాకించుకున్నాడు. యాక్సిడెంట్ అయ్యిందని తన భార్య చనిపోయిందని అందరినీ నమ్మించాడు. అతను రెండు మూడు రోజులు ఆస్పత్రిలో కూడా ఉన్నాడు. ఆ తరువాత నస్రీన్‌కు అడ్డుగా ఉన్న రఫీని చంపేందుకు పథకం పన్నారు. ఈ నెల (అక్టోబర్ 9)న రఫీని చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ నాడు రాత్రి 10 గంటల కు రఫీ పని మీద బయటకు వెళ్లాడు. ఈ విషయాన్ని నస్రీన్ తన ప్రియుడు వెంకన్నకు చెప్పింది. సమాచారం తెలుసుకున్న వెంకన్న తన మిత్రులైన మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన అక్కెనపల్లి శ్రీశైలం, నామారంనకు చెందిన సారగండ్ల మధును తన వెంట తీసుకుని నస్రీన్ ఇంటికి పోయారు. అక్కడ నస్రీన్ తన భర్త రఫీకి తెలియకుండా ఇంట్లో దాచిపెట్టింది. కొద్దిసేపటి తర్వాత రఫీ ఇంటికి వచ్చాడు. రఫీ పడుకున్నా తర్వాత వెంకన్న, నస్రీన్, వెంకన్న మిత్రులు కలిసి రఫీ దాడి చేసి గొంతు నులిమి చంపారు. అక్కడితో ఆగకుండా పైన ఫ్యాన్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నస్రీన్ ప్రవర్తన మీద రఫీ తమ్ముడు సుభాన్ కు అనుమానం వచ్చింది. దీంతో పాటు రఫీ శరీరం మీద కొట్టిన గాయాలు కనబడడంతో సుభాన్ పోలీసులకు విషయం చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించి నస్రీన్ ఫోన్ డాటా తీశారు. దీంతో అసలు కథ మొత్తం బయటపడింది. తీగ లాగితే రెండు మర్డర్లు బయటకొచ్చాయి. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి
పులి మెడకు తాడు కట్టి.. సాధు జంతువు వలె రోడ్డు మీద.
బీసీ ముఖ్యమంత్రి అయితే.. ఈటలనా…? బండి సంజయ్ నా..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కీలక పదవులు..?