రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన కూటమిలో బీఎస్‌పీ చీఫ్ మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చేరతామని ఆ పార్టీ ఎంపీ మలూక్‌నగర్ స్పష్టం చేశారు. బీజేపీని ఓడించేందుకు ఇప్పటికే విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే పొంతన కుదరడం లేదు. మాయావతి కూటమిలో చేరేందుకు సుముఖత చూపిస్తున్నా కొన్ని షరతులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీఎస్‌పీ ఎంపీ మలూక్‌నగర్ స్పందించారు. కూటమిలో బీఎస్‌పీ చీఫ్ మాయావతిని ప్రతిపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేజ్రీవాల్, మమతాబెనర్జీలు కాంగ్రెస్‌కు ప్రధానమంత్రిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మద్దతు ఇచ్చారని తెలిపారు. దళిత సామాజిక వర్గంలో ప్రధాని అభ్యర్థిగా మాయావతికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీఎస్పీ ఎక్కువ సీట్లలో గెలిచిందని గుర్తుచేశారు. తనకు ఉత్తరప్రదేశ్‌లో 14శాతం ఓటు బ్యాంకు ఉందని స్పష్టం చేశారు. అది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. పేద వ్యతిరేక, ధనిక అనుకూల పెట్టుబడిదారులకు బీజేపీ, భారత కూటమి మద్దతునిస్తాయని మాయావతి గతంలో నొక్కి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మాయావతి కూటమిలో చేరతానంటే అఖిలేష్ అసంతృప్తిగా ఉన్నాడన్న మాటలను ఖండించారు. ఇప్పుడున్న కూటమితో బీజేపీపై గెలవడం కష్టమని, బీఎస్‌పీ మద్దతు ఉంటే గెలువడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే గతంలో మాయావతి ఈ కూటమిలో చేరేందుకు సుముఖత చూపించలేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పంజాబ్, హర్యానాలోని ప్రాంతీయ పార్టీలో పొత్తులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఈ విషయమై ఆర్‌ఎల్‌డీ చీఫ్ మాట్లాడుతూ.. బీఎస్‌పీ చీఫ్ మాయావతికి ఈ కూటమిలో చేరడం ఇష్టంలేదని చెప్పుకొచ్చారు. ఇష్టం లేకుండా ఎవరినీ కూటమిలో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు.