పెద్దపల్లి, జూన్ 23: పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూలై 6, 2026 సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
-
ఐసీడీఎస్ మంథని ప్రాజెక్టు: 43 పోస్టులు
-
ఐసీడీఎస్ పెద్దపల్లి ప్రాజెక్టు: 17 పోస్టులు
-
ఐసీడీఎస్ రామగుండం ప్రాజెక్టు: 04 పోస్టులు
అర్హత ప్రమాణాలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా మున్సిపల్ వార్డుకు చెందిన స్థానిక మహిళలై ఉండాలి. ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండి, 01-07-2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. వినికిడి యంత్రాల సహాయంతో వినగలిగే హెచ్‌హెచ్ (HH) అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు:
అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఎస్‌ఎస్‌సీ మెమో, జనన ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, ఇంటర్‌మీడియట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం మరియు వర్తించే వారు సదరం, అనాథ ధృవీకరణ పత్రాలను జతపరచాలి.
గమనిక: ప్రజావాణిలో లేదా కార్యాలయాల్లో నేరుగా ఇచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోరని, కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
