తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. గెలుపొటములపై అభ్యర్థులు, పార్టీల అధినాయకత్వాలు దృష్టి సారించాయి. ఇంకా కొంత మంది ఓటమి నుంచి తేరుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడి అభ్యర్థులు వరుసగా గెలుస్తుంటారు. హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ గెలిసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కొంతమంది రెండో సారి గెలిచి కూడా తమ పట్టును నిలుపుకుంటారు. ఒక్కో నియోజకవర్గంలో వరుసగా కాకపోయిన రెండు మూడు సార్లు అదే నియోజకవర్గంలో పోటీలో ఉండి గెలుస్తారు. సిద్దిపేటలో హారీశ్‌రావు, కరీంనగర్‌లో గంగుల కమలాకర్, సిరిసిల్లలో కేటీఆర్, ఈ సారి కాకుండా అంతకుముందు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ ఇలా ఎంతో మంది వరుసగా గెలుపొందారు.
కానీ చొప్పదండి తీరేవేరు..
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో ఒక్కరు ఒకే సారి గెలుస్తున్నరు. కరీంనగర్ సిటీసమీపంలోనే చొప్పదండి నియోజకవర్గ కేంద్రం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో గత 25 ఏండ్లలో ఏ ఒక్కరూ రెండోసారి గెలువలేదు. 1999లో కాంగ్రెస్ తరుపున కోడూరి సత్యనారాయణ గౌడ్, గెలుపొందారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో సాన మారుతి టీడీపీ తరుపున గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కోడూరి సత్యనారాయణ గౌడ్ రెండో స్థానంలో నిలిచారు.
ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారడంతో..
2009లో చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి సుద్దాల దేవయ్య గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గునుకొండ బాబు రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. 2014 ఎన్నికల్లో బీఆర్ ఎస్(అప్పటి టీఆర్ ఎస్ ) నుంచి బొడిగే శోభ గెలుపొందారు. 2009లో గెలుపొందిన సుద్దాల దేవయ్య 2014 లో ఓటమి చవిచూశారు. 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్(అప్పటి టీఆర్ ఎస్ ) తరుపున సుంకె రవిశంకర్ పోటీ చేసి గెలుపొందారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న శోభ రెండోసారి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక తాజాగా 2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరుపున రెండో సారి గెలిచి రికార్డు ను సృష్టించాలనుకున్న సుంకె రవిశంకర్ కు ఓటమి ఎదురైంది. 2014, 2018లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన మేడిపల్లి సత్యం 2023 లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత 25 ఏండ్ల కాలంలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మరోసారి గెలువడంలేదు. ఇక్కడి ప్రజలు విలక్షణంగా ఓటువేస్తూ ప్రతి సారి కొత్తవారినే ఎన్నుకుంటున్నారు.
గతంలో చూసుకున్నట్టయితే ..
చొప్పదండి నియోజకవర్గం 1957లో ఏర్పాటు అయ్యింది. మొదట్లో ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని కొంత భాగం, పెగడపల్లి మండలం, రామడుగు గంగాధర, బోయినిపల్లి, చొప్పదండి, కొడిమ్యాల, మల్యాల మండలాలు ఉండేవి. తర్వాత కాలక్రమేన గొల్లపల్లి, పెగడపల్లి ఈ నియోజకవర్గం నుంచి వేరయ్యాయి. 2009 పునర్విభజన లో భాగంగా చొప్పదండిలో కేవలం ఆరు మండలాలే మిగిలాయి. అవి చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినిపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాలే మిగిలాయి.
1957లో మొదటిసారి సీహెచ్ రాజేశ్వర్‌రావు పీడీఎఫ్ పార్టీ నుంచి గెలుపొందారు.
1962లో బి. రాములు (కాంగ్రెస్)
1967, 1972 రెండు సార్లు ఈ నియోజకవర్గాన్ని కరీంనగర్‌లో విలీనం చేశారు.
1978 న్యాలకొండ శ్రీపతి రావు (కాంగ్రెస్)…. సమీప ప్రత్యర్థి ముదిగంటి కృష్ణారెడ్డి, (రెడ్డి కాంగ్రెస్ ఆవుదూడ గుర్తు)
1983 గుర్రం మాధవరెడ్డి (టీడీపీ)…. సమీప ప్రత్యర్థి ఏ. నారాయణరెడ్డి (కాంగ్రెస్)
1985 న్యాలకొండరాంకిషన్‌రావు (టీడీపీ)….. సమీప ప్రత్యర్థి రామస్వామి గౌడ్ (కాంగ్రెస్)
1989 న్యాలకొండరాంకిషన్‌రావు (టీడీపీ)…. సమీప ప్రత్యర్థి సత్యనారాయణగౌడ్ (కాంగ్రెస్)
1994 న్యాలకొండరాంకిషన్‌రావు (టీడీపీ)…. సమీప ప్రత్యర్థి సత్యనారాయణగౌడ్ (కాంగ్రెస్)
1999 కోడూరి సత్యనారాయణ గౌడ్ (కాంగ్రెస్)…. సమీప ప్రత్యర్థి రాంకిషన్ రావు (టీడీపీ)
2004 సానమారుతి (టీడీపీ)…. సమీప ప్రత్యర్థి సత్యనారాయణ గౌడ్ (కాంగ్రెస్)
2009 సుద్దాల దేవయ్య (టీడీపీ)…. సమీప ప్రత్యర్థి గునుకొండ బాబు(కాంగ్రెస్)
2014 బొడిగె శోభ (బీఆర్ ఎస్)……సమీప ప్రత్యర్థి సుద్దాల దేవయ్య (కాంగ్రెస్)
2018 సుంకె రవిశంకర్ (బీఆర్ ఎస్)…….సమీప ప్రత్యర్థి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్)
2023 మేడిపల్లి సత్యం (కాంగ్రెస్)……….సమీప ప్రత్యర్థి సుంకెరవిశంకర్ (బీఆర్ ఎస్)
By Madhu pokala : Political content Writer Karimnagar
క’న్నీట’ చెన్నై .. హృదయవిదారక వీడియోలు