Shah rukh khan”
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడ్డారని సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కింగ్’ అనే యాక్షన్ డ్రామా చిత్ర షూటింగ్లో ఓ యాక్షన్ సీన్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.
గాయానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఆయనకు డూప్ లేకుండా స్టంట్ చేయడం వల్ల తీవ్రమైన కండర గాయం అయినట్లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో షారూఖ్ బృందం అత్యవసర చికిత్స కోసం అమెరికాకి ప్రయాణించినట్టు పలు ఆంగ్ల మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
చికిత్స కోసం తాత్కాలికంగా షూటింగ్‌ను సెప్టెంబర్ వరకు వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పెద్దగా ఆందోళన కలిగించే స్థితి లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘కింగ్’ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించనుండగా, రాణీ ముఖర్జీ ఆమె తల్లి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమా గురించి అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
