రెండు హ‌త్య‌ల కేసులో వ్య‌క్తికి జీవిత ఖైదు శిక్ష‌.. వివ‌రాలు వెల్ల‌డించిన రాజ‌న్న సిరిసిల్ల ఎస్పీ

రాజన్న సిరిసిల్ల:
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. నిందితుడు వంగ సందీప్ రెడ్డికి యావజ్జీవ కారాగార (జీవితఖైదు) శిక్ష విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం కీలక తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఒక ప్రకటనలో తెలిపారు.

మొదటి హత్య కేసు: కత్తితో దాడి చేసి వ్యక్తి హత్య
పోలీసుల వివరాల ప్రకారం.. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ సందీప్ రెడ్డికి, అదే గ్రామానికి చెందిన బీనబోయిన దేవయ్యకు మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో దేవయ్యను హతమార్చాలని పథకం వేసిన సందీప్ రెడ్డి.. 2018 మార్చి 17న దేవయ్య ఒక కుటుంబ వేడుకకు హాజరైన సమయంలో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో దేవయ్య ప్రాణాలు కోల్పోగా, అతని తండ్రి సిద్ధిరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ బన్సిలాల్ కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించి చార్జిషీట్ దాఖలు చేశారు.

రెండో హత్య కేసు: గొడ్డలితో నరికి దారుణంగా..
మొదటి కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన సందీప్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదు. కామారెడ్డికి చెందిన మాన్నె నరసింహులు అనే వ్యక్తితో కూడా అతనికి భూ వివాదాలు ఉన్నాయి. 2022 జూలై 31న నరసింహులు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో సందీప్ రెడ్డి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. నరసింహులు అక్కడికక్కడే మరణించగా, అతని అన్న కొడుకు మన్నె రాజు ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ మొగిలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

20 మంది సాక్ష్యులతో నిరూపితమైన నేరం
ఈ రెండు కేసుల విచారణ అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో అత్యంత పకడ్బందీగా సాగింది. కోర్ట్ మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఐలు, గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు న్యాయస్థానంలో 20 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ.. రెండు కేసుల్లోనూ సందీప్ రెడ్డి నేరస్థుడిగా తేలడంతో జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

తప్పు చేస్తే శిక్ష తప్పదు: ఎస్పీ మహేష్ బి. గితే
సమాజంలో నేరాలకు పాల్పడే వారు చట్టం నుంచి, శిక్షల నుంచి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. సరైన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్నారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో పనిచేసి శాస్త్రీయ ఆధారాలను కోర్టు ముందు ఉంచడం వల్లే ఈ శిక్ష పడిందని పేర్కొన్నారు. నిందితుడికి శిక్ష పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఎస్ఐలు మరియు కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.