దేశరాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరిగింది. రూ. 25 కోట్ల నగలను దుండగులు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్‌లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. సుమారు 25 కోట్ల రూపాయల విలువైన నగలను దోచుకెళ్లారు. నగల దుకాణంపై పైన గోడకు రంధ్రాలు చేశారు. లోపలకి వెళ్లి స్ట్రాంగ్ రూం లో ప్రవేశించారు. ఆ రూంలో ఉన్న సుమారు 25 కోట్ల విలువైన బంగారు నగలను తీసుకెళ్లారు. సోమవారం నగల దుకాణానికి సెలవు ఉండడంతో మంగళవారం ఉదయం షాపు ఓపెన్ చేశారు. ఇది గమనించిన యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనానికి ముందు సీసీటీవీ కెమెరాలను డిస్ కనెక్ట్ చేశారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను దొంగలు పగలగొట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించేందుకు దొంగలు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. లాకర్‌లో ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్ డిస్‌ప్లేలో ఉన్న బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. షోరూం యజమాని సంజీవ్ జైన్ మాట్లాడుతూ.. ఆదివారం షాపు మూసేశామని, సోమవారం సెలవు కావడంతో మంగళవారం ఉదయం షాపు తెరిచి చూడగా షాపు మొత్తం దుమ్ము, స్ట్రాంగ్ రూం గోడకు రంధ్రం పడి ఉందని తెలిపారు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఉన్నదంతా దోచుకెళ్లారు. దాదాపు రూ.20-25 కోట్ల విలువైన ఆభరణాలను దుకాణంలో ఉంచారు. దొంగలు దుకాణం పైకప్పు నుంచి లోపలికి ప్రవేశించారు. షోరూం పైకప్పు, గోడ పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు సులువుగా చోరీకి పాల్పడ్డారని జైన్ తెలిపారు. సీసీటీవీ సహా అన్నీ ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. పోలీసులు జ్యువెలరీ షోరూమ్ సిబ్బందిని కూడా విచారించారు, త్వరలో ఆధారాలు దొరుకుతాయని పేర్కొన్నారు