ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల్లో విజయం సాధించినవారి శాతం ఎక్కువ. ఇదేదే ఊరికే అన్న మాట కాదు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల నుంచి 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల వరకు అందుబాటులో ఉన్న లెక్కలను గమనిస్తే, ప్రతిసారీ విజయం సాధించినవారి నిష్పత్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంది. ఇక, పార్లమెంట్ చరిత్రలోనే 17వ లోక్‌సభలో అత్యధికంగా 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. ఇది మొత్తం సభ్యులలో దాదాపు పదిహేను శాతం. రాజకీయాల్లో మహిళలు రాణిస్తున్నారు. అయితే కొన్ని వర్గాలకు చెందిన మహిళలు మాత్రమే చట్టసభలకు వెళ్లగలుగుతున్నారు. అన్ని వర్గాల నుంచి మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలంటే రిజర్వేషన్ల అవసరం ఎంతైనా ఉంది. కానీ దశాబ్దాలుగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో మహిళల స్థితిగతులపై నియమించిన కమిటీ (1974?1975) ‘టువార్డ్స్ ఈ క్వాలిటీ’ పేరుతో రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ స్వతంత్ర భారతదేశంలో మహిళా ఉద్యమానికి పునాది వేస్తుంది. వివక్షాపూరిత సామాజిక సాంస్కృతిక పద్ధతులు, రాజకీయ మరియు ఆర్థిక పక్రియలను ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఇందులో మహిళలకు రిజర్వేషన్‌పై కూడా చర్చ జరిగింది. అయితే, కమిటీలోని మెజారిటీ సభ్యులు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. మహిళలు స్వశక్తితో రాజకీయాల్లో ఎదగాలని, రిజర్వేషన్ల ద్వారా కాదని వారు వాదించారు. తరువాత, రాజీవ్ గాంధీ హయాంలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు తీసుకురావటానికి చాలా ప్రయత్నించారు. కానీ, రాష్ట్ర అసెంబ్లీలు దానిని వ్యతిరేకించటంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. రాజీవ్ హయాంలో ఇది సాధ్యం కాలేదు..కానీ పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నపుడు పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇక, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను సమాజ్ వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాయి. మహిళలకు ఇస్తున్న 33 శాతం రిజర్వేషన్‌లో 33 శాతం వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఈ పార్టీల డిమాండ్. 1996లో దేవేగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ బిల్లును వ్యతిరేకించారు. జూన్ 1997లో ఈ బిల్లును ఆమోదించడానికి మళ్లీ ప్రయత్నం జరిగింది. అప్పుడు, జనతాదళ్ నేత శరద్ యాదవ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.1998లో కొలువుదీరిన
12వ లోక్‌సభలో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆర్జేడీకి చెందిన ఓ ఎంపీ వెల్‌లోకి దూసుకెళ్లి బిల్లు కాపీలను చించేశారు. 1999లో 13వ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును రెండుసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ బిల్లు ఆమోదం పొందలేదు. 2010లో యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని ఎస్పీ, ఆర్జేడీ బెదిరించాయి. దాంతో బిల్లుపై ఓటింగ్ వాయిదా పడింది. తరువాత అదే ఏడాది మార్చి 9 రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 186 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఒక్కరు ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా అనేక వాదనలు ఉన్నాయి. మహిళలు ఒక కులం మాదిరిగా ఒక జాతి కాదని,అలాంటప్పుడు వారికి రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారనేది ప్రధాన వాదన. అలాగే, మహిళలకు రిజర్వేషన్ ద్వారా సీట్లు కేటాయించడం రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించడమవుతుందనేది మరికొందరి వాదన. ఆడవాళ్లకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే ప్రతిభ ఆధారంగా పోటీ చెయ్యలేకపోవచ్చని.. రిజర్వేషన్లు ఇవ్వడం మహిళల్లో పోరాట స్ఫూర్తిని అణగదొక్కే ప్రయత్నం అనే వాదన కూడా ఉంది. ఏదేమైనా, ఎంతమంది వ్యతిరేకించినా..దశాబ్దాలుగా మహిళలు కంటున్న కల మోడీ హయాంలో సాకారమవుతోంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ..అది భారత రాజకీయాల్లో సరికొత్తా అద్యయానికి నాంది అవుతుంది!
భారతీయులు అప్రమత్తం కావాలి హెచ్చరించిన భారత విదేశాంగ శాఖ
దెబ్బకు దెబ్బ.. కెనడాకు భారత్ ధీటైన సమాధానం..