సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలలో ఎట్టకేలకు మోక్షం లభించింది. దీంతో మహిళలు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. చిరకాల కల నెరవేరినా వారికి ఎక్కడో ఎక్కడో ఒక అనుమానం. అమలెప్పుడువుతుంది. ఎప్పుడు చట్టసభల్లో అడుగుపెడుతామనే ప్రశ్న వేధిస్తూనే ఉంది. మరి 2024 నుంచి అమలులోకి వస్తుందా లేక 2029లోనా, లేదంటే 2034 వరకూ ఆగాలా ఇంకా ఎక్కువ సమయం పడుతుందా..? మహిళా రిజర్వేషన్లకు 2023లో ఆమోదం తెలిపారు. దీంతో 2024 ఎన్నికల నుంచి అమలులోకి వస్తుందని అందరూ భావించారు. కొన్ని మీడియా సంస్థలు ఏఏ పురుష అభ్యర్థుల స్థానాలు గల్లంతు అవుతాయో కూడా వివరంగా రాసుకొచ్చారు. కానీ ప్రధాని మోడీ 2027 నుంచి ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని పార్లమెంట్ ప్రకటించారు. ఇన్నిఅనుమానాలకు నియోజకవర్గాల పునర్విభజనే ప్రధాన కారణం. పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లులో ‘రాజ్యాంగ సవరణ (128 వ రాజ్యాంగ సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజక వర్గాలను పునర్విభజించి, 15 ఏండ్ల పాటు రిజర్వేషన్ అమలు చేస్తాం’ అని పేర్కొంది.
ముందుగా జనాభా లెక్కలు ఆతరువాత నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ తరువాత మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పక్రియ ఎప్పుడు పూర్తి చేయాలనే దానిపై నిర్దిష్టమైన తేదీలేవిూ లేవు. కాబట్టి ఈ చట్టం ఎప్పటి నుంచి అమలు లోకి వస్తుందనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర కూడా సమాధానం లేదు. అసలు ఈ చట్టంతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ అంటే ఏమిటోచూద్దాం.. జనాభా ప్రాతిపదికన కాలానుగుణంగా లోక్‌సభ, శాసనసభల నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరించటాన్ని డీలిమిటేషన్ అంటారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే, 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత 2001 వరకు లోక్‌సభ నియోజకవర్గాల విస్తరణ నిలిపి వేశారు. అలాగే 2001లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్‌సభ నియోజక వర్గాల విస్తరణను నిలిపేశారు. 2008లో దేశంలోని కొన్ని రాష్టాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి, దాని ప్రకారం 2009 నుంచి తదుపరి ఎన్నికలు జరిగాయి. కానీ సీట్ల సంఖ్య పెరగలేదు. దీంతో లోక్‌సభ సభ్యుల సంఖ్య 543గానే ఉండిపోయింది. మరోవైపు, భారతదేశం జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానానికి చేరింది. దాంతో అందరికీ ప్రాతినిధ్యం దక్కాలంటే లోక్‌సభ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ప్రభుత్వం డీలిమిటేషన్ తర్వాత అమలు చేస్తామని చెబుతోంది. ఇక ఈ డీలిమిటేషన్‌కు జనాభా లెక్కలు ప్రాతిపదిక అవుతుంది. ప్రతి పదేళ్లకొకసారి దేశ జనాభాని లెక్కిస్తారు. చివరి జనాభా లెక్కలు 2011లో జరిగాయి. మళ్లీ 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా నిర్వహించ లేదు. మళ్లీ జన గణన ఎప్పుడన్నదానిపై స్పష్టత లేదు. వాస్తవానికి, 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను 2026 తర్వాత పెంచుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం ..అంటే 2031 సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. దాని నిర్ణయం ప్రకారం మహిళలకు సీట్లను కేటాయిస్తారు. అప్పటి వరకు, 2001 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు కొనసాగుతాయి. ఇక, జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడు చేపట్టినా, దాని తుది నివేదిక రావడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ పని ప్రారంభమవుతుంది. ఇదో సుదీర్ఘ పక్రియ. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. 2031లోనే జనాభా గణన జరుగుతుందనుకుంటే, మహిళ రిజర్వేషన్ అమలు 2039 సార్వత్రిక ఎన్నికల తర్వాతే సాధ్యమవుతుంది. ఇదంతా జరగడానికి కనీసం పదేళ్లు పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్టికల్ 82 ( 2001లో సవరణ జరిగినది) ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల కంటే ముందు డీలిమిటేషన్‌ను కుదరదు. అది 2031 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను ఇవ్వడానికి 3 నుండి 4 సంవత్సరాలు పట్టొచ్చు. అంతేకాకుండా, జనాభా నిష్పత్తి మార్పులను బట్టి రాబోయే డీలిమిటేషన్‌లో చాలా వివాదాలు తలెత్తుతాయి. కాబట్టి ఇదంతా జరగడానికి 2037 లేదా 2039 వరకు పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి ఇవి కూడా