Illegal immigrants” వాషింగ్టన్, జూలై 2:
అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా ఉందని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2025 జనవరి నుంచి మే మధ్య కాలంలో 10,382 మంది భారతీయులు అమెరికా సరిహద్దుల్లో అరెస్ట్ అయ్యారు. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం.
గత ఏడాదితో పోలిస్తే అక్రమ ప్రవేశాల సంఖ్యలో 70% తగ్గుదల కనిపించిందని అధికారులు వెల్లడించారు. ట్రంప్ తిరిగి అధికారం చేపట్టిన అనంతరం సరిహద్దు భద్రత మరింత కఠినమవ్వడంతో మానవ అక్రమ రవాణా ముఠాల కార్యకలాపాలు తగ్గినట్టు చెబుతున్నారు.
అమెరికా మెక్సికో, కెనడా సరిహద్దుల మీదుగా ప్రవేశించేందుకు వలసదారులు అత్యంత ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. డెల్ మార్ ప్రాంతంలో మే 9న జరిగిన పడవ ప్రమాదంలో ఇద్దరు భారతీయ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారు ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య సుమారు 2.2 లక్షలు గా అంచనా. 2025లో ఇప్పటివరకు 300 మందికి పైగా స్వదేశానికి పంపించినట్లు సమాచారం.
ఇది చూసి తెలుస్తోంది భారత్ నుంచి అనేక మంది, ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం వారు, అగ్రరాజ్యంలో స్థిరపడాలనే ఆశతో ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రయాణాలు చేస్తున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే, అక్రమ మార్గాలు అంత సులభం కాదని స్పష్టమవుతోంది.
