Inter exams” ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షలకు 45 రోజుల నుంచి రెండు నెలల ముందుగానే హాల్‌టికెట్లను తల్లిదండ్రులకు పంపించాలని బోర్డు నిర్ణయించింది. దీని వల్ల హాల్‌టికెట్‌లో ఉన్న వివరాలను ముందుగానే పరిశీలించి ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
హాల్‌టికెట్‌లో ముద్రించిన పేరు, పుట్టిన తేదీ, పరీక్షా కేంద్రం, హాల్‌టికెట్ నంబర్, పరీక్షల తేదీలు తదితర వివరాలను తల్లిదండ్రులు జాగ్రత్తగా తనిఖీ చేయాలని బోర్డు సూచించింది. ఏవైనా తప్పులు కనిపిస్తే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌కు తెలియజేయాలని స్పష్టం చేసింది.
పరీక్షా కేంద్రం చిరునామా, ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందనే సమాచారం తల్లిదండ్రులకు నేరుగా చేరాలన్నదే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఎక్కువ మంది తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త ఊపిరి: సీఎం రేవంత్ రెడ్డి
మూసీ నది పునరుజ్జీవంతో హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచి, నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో మూసీ అభివృద్ధిపై జరిగిన చర్చకు స్పందిస్తూ ఆయన విస్తృతంగా వివరణ ఇచ్చారు.
గోదావరి జలాలను మూసీ నదిలోకి తరలించి ఏడాది పొడవునా నిరంతర ప్రవాహం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియలో నిర్వాసితులకు పునరావాసం కల్పించి, వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు నైట్ బజార్‌లు, వాణిజ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
నిజాం పాలకులు ముందుచూపుతో నగర జలవనరులను అభివృద్ధి చేశారని, వారి కాలంలో నిర్మించిన ప్రాజెక్టులే నేటికీ హైదరాబాద్ ప్రజల నీటి అవసరాలను తీర్చుతున్నాయని సీఎం గుర్తుచేశారు. అయితే గత పాలకులు నదులు, చెరువులను నిర్లక్ష్యం చేసి కలుషితం చేశారని విమర్శించారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలతో నదీ పరివాహక ప్రాంతాలను నాశనం చేశారని ఆరోపించారు.
మూసీ నది కాలుష్యంతో నల్లగొండ జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితి నుంచి తమను రక్షించాలని వేలాదిగా విజ్ఞప్తులు రావడంతో మూసీ పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
మూసీ అభివృద్ధి కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లతో అధ్యయనాలు చేపట్టామని, లండన్, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించినట్లు చెప్పారు. ప్రపంచంలోని అనేక నగరాలు నదులను కేంద్రంగా చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని ఉదాహరణగా ప్రస్తావించారు.
గోదావరి నుంచి సుమారు 20 టీఎంసీల నీటిని తరలించే ప్రణాళిక ఉందని, అందులో 15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, మరో 5 టీఎంసీలను గండిపేటకు మళ్లించాలనుకుంటున్నామని సీఎం వివరించారు. మూసీ ప్రక్షాళన కోసం గ్లోబల్ టెండర్లు పిలవగా, మూడు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ఈ పనులు చేపట్టాయని చెప్పారు.
మొదటి దశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం గండిపేట నుంచి గౌరెల్లి వరకు మొత్తం 51 కిలోమీటర్ల పరిధిలో మూసీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. నది పొడవునా ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
మూసీ, ఈసీ నదులు కలిసే ప్రాంతంలో బాపుఘాట్ అభివృద్ధి చేయనున్నామని, అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌ను చేపట్టామని తెలిపారు. వీరాళం ట్యాంక్ కూడా మూసీ అభివృద్ధి ప్రణాళికలో భాగమేనని, అక్కడ రూ.450 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోందన్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిల నిర్మాణంతో పాటు ప్రజలకు వినోదం, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏడీబీ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణానికి సానుకూల స్పందన వచ్చిందని సీఎం తెలిపారు.
డీపీఆర్ పూర్తయ్యాక అసెంబ్లీలో పూర్తి స్థాయి చర్చ నిర్వహించి సభ్యుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు అవసరమైన అభివృద్ధి పనులపై సూచనలు ఇవ్వాలని కోరారు. పేదలకు మెరుగైన నివాస వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే నగరంగా మార్చడమే తమ సంకల్పమని, మంచి సూచనలు, సలహాలతో సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు – రైతులకు నూతన సంవత్సర కానుక
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని రైతులకు నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రీ–సర్వే పూర్తైన గ్రామాల్లో కొత్త పాసుపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాసుపుస్తకాల పంపిణీ వివరాలను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో తాను స్వయంగా ఒక రోజు పాల్గొంటానని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఫొటోలతో భూ హక్కు పత్రాలు జారీ చేయడంపై విమర్శలు చేశారు. ఆ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రీ–సర్వే నిర్వహించి తప్పులను సరిదిద్దుతూ కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు అమలు చేస్తున్నామని సీఎం గుర్తు చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పాసుపుస్తకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. వేలాది గ్రామాల్లో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోందన్నారు.
గతంలో జగన్ ఫొటోతో ఉన్న పాసుపుస్తకాల స్థానంలో రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు అందుతుండటంతో ప్రజల్లో విస్తృతంగా ఆనందం వ్యక్తమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేక రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వివాదాలు లేని భూములను కూడా రీ–సర్వే పేరుతో సమస్యాత్మకంగా మార్చారని విమర్శించారు.
భూమే జీవనాధారంగా బతికే రైతులకు భూ వివాదాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించామని తెలిపారు. నేటి పాసుపుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపుతోందని అన్నారు.
పాసుపుస్తకాలపై తమ చిత్రాల కోసం గత పాలకులు రూ.22 కోట్ల వరకు ఖర్చు చేశారని ఆరోపించిన సీఎం, ప్రజలకు భూ సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు.
