జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జనవరి 21, 2026 గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఫిబ్రవరి 22, 2026న ప్రవేశ పరీక్ష నిర్వహణ
గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష పై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి
గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జనవరి 21, 2026 గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల బాలికల బాలుర పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి & 6 నుంచి 9వ తరగతులలో ఖాళీ సీట్లలో ప్రవేశం కోసం (ఇంగ్లీష్ మీడియం) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
ఆసక్తి గలవారు జనవరి 21 ,2026 లోపు కుల సర్టిఫికెట్ ఆదాయ సర్టిఫికెట్, ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉంటుందని, వివరాలకు ఆన్లైన్ లో సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పట్టణ ఓటర్ జాబితా పై అభ్యంతరాలను తెలియజేయాలి..
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
124 వార్డులలో 2 లక్షల 58 వేల 59 ఓటర్లతో డ్రాఫ్ట్ జాబితా సిద్ధం
జనవరి 10న తుది ఓటర్ జాబితా ప్రచురణ
పట్టణాలలో ఓటర్ జాబితా పై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి
పట్టణ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా పై అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తెలిపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు (పెద్దపల్లి మంథని, సుల్తానాబాద్) 1 మున్సిపల్ కార్పొరేషన్ (రామగుండం) కలిపి మొత్తం 124 వార్డులలో 2 లక్షల 58 వేల 59 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు సరైన వార్డులో ఉందా లేదా చెక్ చేసుకోవాలని లేని పక్షంలో వెంటనే సంబంధిత మున్సిపల్ కార్యాలయంలో తమ ఫిర్యాదు నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
జనవరి 10న పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్ జాబితా తయారీపై జనవరి 5న మున్సిపల్ కార్యాలయాల్లో, జనవరి 6న కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
——————————————————————————————————————–
క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ.
పెద్దపల్లి :
తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీ లను జిల్లా కలెక్టర్ శ్రీ. కోయ శ్రీహర్ష చేతుల మీదుగా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ.డి.వేణు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జే.అరుణశ్రీ సమక్షంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీటా జిల్లా అధ్యక్షులు డి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బండి ప్రకాశ్, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.సంపత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ దత్తు ప్రసాద్,రమేష్ ట్రెజరర్ ఆర్.పద్మావతి, తహసీల్దార్లు, టి జి ఆర్ ఎస్ ఏ జిల్లా అధ్యక్షులు డా. రాపెల్లి రాముడు, ప్రధాన కార్యదర్శి సి. హెచ్. అనిల్ కుమార్, మహిళా అధ్యక్షురాలు బి.లక్ష్మి, కోశాధికారి నుగూరి విజయ్ ఇతర కార్యవర్గ సభ్యులు మరియు పెద్దసంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
వైద్యుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ
జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శ్రీధర్
పెద్దపల్లి
జనవరి 7న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పీడియాట్రిక్, ఆప్తామాలజిస్ట్, రేడియాలజీ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఎంబిబిఎస్), జనరల్ మెడిసిన్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు జనవరి 7న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఆసక్తి గల వైద్యులు తమ యొక్క దరఖాస్తు బయోడేటా తో పాటు అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్ల తో పాటు జిరాక్స్ ప్రతులు ఒక సెట్ తో హాజరు కావాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులకు నెలకు లక్ష రూపాయలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నెలకు 52,351 రూపాయల వేతనం ఉంటుందని , ఇతర వివరాలకు 8499061999,9492457809 నెంబర్ నందు సంప్రదించాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రామాలలో అభివృద్ధి పనులు మార్చి చివరి నాటికి పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి
గ్రామాలలో అభివృద్ధి పనులు మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వివిధ గ్రాంట్స్ క్రింద చేపట్టిన అభివృద్ధి పనులను జనవరి , ఫిబ్రవరి,మార్చి మాసాలలో 2026 చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో అవసరమైన నూతన పనుల ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, తహసిల్దార్ కార్యాలయాలలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రత్యేకంగా పరిగణించి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. గుత్తేదారులు నుంచి టెండర్లు రాని అభివృద్ధి పనులను పరిశీలించి పది రోజులలో ఆ పనులు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీలలో నూతనంగా పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో ఎటువంటి అభివృద్ధి పనులు పంచాయతీ తీర్మానం లేకుండా చేపట్టడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను గ్రామాలలో చేపట్టాలని, వాటికి గ్రామ పంచాయతీ తీర్మానం అత్యవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎస్ఈ పంచాయతీ రాజ్ టి.ఏ.చక్రవర్తి ఈఈ పంచాయతీరాజ్ శంకరయ్య , డీఈ లు అప్పల నాయుడు, రాజమౌళి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
