పట్టణ ప్రాంతాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

కరీంనగర్ |

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

సోమవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.

ఇందిరమ్మ చీరలకు మంచి స్పందన

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఇందిరమ్మ చీరల నాణ్యతపై మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

మహిళా సంఘాలలో సభ్యులుగా లేని అర్హులైన మహిళలను రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించాలని, చీరల పంపిణీ సమయంలో ఎలాంటి రద్దీ లేకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వడ్డీ లేని రుణాలపై ప్రత్యేక దృష్టి

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలలో ఈ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

పట్టణాల్లో నిర్వహించే వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాల్లో మహిళా సమాఖ్యలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. అలాగే ప్రతి పట్టణ పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను స్థానిక ప్రజా ప్రతినిధులకు అందించాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

అనుమతించిన లొకేషన్‌లోనే ఇసుక తవ్వకాలు
విచారణ బృందం నివేదిక

కరీంనగర్ | మదర్ న్యూస్ ప్రతినిధి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు పరిధిలోని మానేరు వాగులో ఇసుక క్వారీకి అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏడుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు.

విచారణ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం, రేజింగ్ కాంట్రాక్టర్ చల్లూరు పరిధిలో అనుమతి పొంది, అనుమతించిన లొకేషన్‌లోనే ఇసుక తవ్వకాలు నిర్వహించినట్లు, ఎక్కడా అక్రమ మైనింగ్ జరగలేదని కమిటీ స్పష్టం చేసింది.

డీజీపీఎస్ (DGPS) ద్వారా సర్వే నిర్వహించగా, అనుమతి ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరిగినట్లు నిర్ధారణ అయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

వ్యవసాయ బావులు, పైప్‌లైన్లు, మోటార్లు తొలగించి దౌర్జన్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలపై కూడా విచారణ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. పరిశీలనలో బావులకు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని, అవన్నీ నది పరిధి (రివర్ బెడ్)లోనే ఉన్నట్లు తేలిందని తెలిపింది. వాల్టా చట్టం ప్రకారం నది పరిధిలో బావుల తవ్వకాలకు అనుమతి లేదని కమిటీ పేర్కొంది.

అదేవిధంగా రేజింగ్ కాంట్రాక్టర్ ఇచ్చిన అనుమతుల ప్రకారం మాత్రమే, అనుమతించిన లొకేషన్‌లో మరియు అనుమతించిన లోతులోనే ఇసుక తవ్వకాలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *