యుద్ధం అంటే ఆషామాషీ కాదు.. ఒక్క రోజులోనే అమెరికా ఖజానాకు రూ. 7,000 కోట్ల ఖర్చు

irana-war

వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అగ్రరాజ్యం అమెరికాకు ఆర్థికంగా సెగ పుట్టిస్తున్నాయి. ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే అమెరికా ఖజానాకు భారీగా గండి పడుతోంది. కేవలం మొదటి 24 గంటల్లోనే దాదాపు రూ.7,000 కోట్లు ($779 మిలియన్లు) వెచ్చించినట్లు రక్షణ రంగ నిపుణుల అంచనా.

యుద్ధ క్షేత్రంలో ఖర్చు ఇలా..

యుద్ధం మొదలవ్వకముందే యుద్ధ విమానాలు, నౌకలు మరియు బలగాల మోహరింపు కోసం అమెరికా సుమారు రూ.5,700 కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఈ అంకెలు మరింత పెరిగే అవకాశం ఉంది.

  • ఆయుధ వ్యవస్థల వినియోగం: ఇరాన్ లక్ష్యాలపై దాడులకు అమెరికా 20కి పైగా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను వాడుతోంది. ఇప్పటికే 11 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు యూఎస్ మిలిటరీ ప్రకటించింది.

  • నిర్వహణ వ్యయం: ఒక్కో యుద్ధ విమాన వాహక నౌక (ఉదాహరణకు: యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్) నిర్వహణకే రోజుకు దాదాపు రూ.59 కోట్లు ఖర్చవుతోంది.

అమెరికాను వేధిస్తున్న ఆయుధాల కొరత?

ఖర్చు కంటే కూడా ఆయుధాల నష్టం అమెరికాను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారీగా ఆయుధాలను మోహరించిన అమెరికాకు, తాజా ఘర్షణల్లో ఆయుధ వ్యవస్థలను కోల్పోవడం ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. కువైట్‌లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోవడం కూడా పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

రూ. 3.1 లక్షల కోట్లు: 2023 అక్టోబరు నుంచి ఇప్పటివరకు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కోసం అమెరికా చేసిన మొత్తం ఖర్చు (అంచనా).

ట్రంప్ సంకేతాలు: యుద్ధం ఇప్పుడే ముగియదా?

ఇరాన్‌పై యుద్ధం మరో 4 నుండి 5 వారాలు కొనసాగే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. దీనివల్ల అమెరికా రక్షణ బడ్జెట్ ప్రస్తుతమున్న ట్రిలియన్ డాలర్ల నుండి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే క్షిపణి నిరోధక వ్యవస్థల సమర్థతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *