సిరిసిల్లలో విషాదం.. ఆరుగురు దుర్మరణం.. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం: 

రాజన్న సిరిసిల్ల: హైదరాబాద్‌ శివార్లలోని పెద్ద గోల్కొండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. యాదగిరిగుట్ట దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదం ఎలా జరిగిందంటే.. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు తమ కారులో హైదరాబాద్ నుండి తిరిగి వస్తుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద గోల్కొండ ప్రాంతంలోని ఎగ్జిట్ 16, శంషాబాద్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

మృతుల వివరాలు: ఈ ప్రమాదంలో బొల్లి శివకుమార్, కోడం శ్రీనివాస్, కోడం శ్వేత, కోడం కృష్ణచంద్ర, కోడం మాధవ్, బొల్లి రిషికలు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొల్లి లాస్య ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు: ఈ ప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి స్పందించి, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ వార్త వినగానే బొల్లి రాంమోహన్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సైతం ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతిమ సంస్కారాలు: ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు మృతదేహాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, శనివారం మృతదేహాలను స్వగ్రామమైన సిరిసిల్లకు తీసుకురానున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో సిరిసిల్లలో విషాదఛాయలు అలముకున్నాయి.

మట్టి లేకుండా ఇంట్లోనే నీటిలో కొత్తిమీరను ఇలా సులభంగా పెంచుకోండి!

మహీంద్రా & మహీంద్రా కంపెనీలో భారీగా ఉద్యోగ అవకాశాలు: కరీంనగర్‌లో రేపే ఇంటర్వ్యూలు!