భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం దక్కబోతోంది. భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి అనిల్ మీనన్ (Anil Menon) తన మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. జూలై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వేదికగా దాదాపు ఎనిమిది నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ మిషన్‌లో ఆయన కీలకమైన శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు.
రష్యన్ వ్యోమగాములతో కలిసి ప్రయాణం
కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి రష్యాకు చెందిన ‘రోస్కోస్మోస్ సోయుజ్ MS-29’ (Roscosmos Soyuz MS-29) వ్యోమనౌక ద్వారా అనిల్ మీనన్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఈ వ్యోమనౌక నిశ్చయించిన సమయానికి లాంచ్ అయిన తర్వాత, భూమి చుట్టూ రెండు కక్ష్యలు పూర్తి చేసుకుని స్పేస్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఆయనతో పాటు రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా ఈ ప్రయాణంలో భాగస్వాములు కానున్నారు. వీరంతా అంతరిక్ష కేంద్రంలో ‘ఎక్స్‌పెడిషన్ 74, 75’ పరిశోధనల్లో పాల్గొని, తిరిగి ఏప్రిల్ 2027లో భూమికి చేరుకుంటారు.
ఎవరీ అనిల్ మీనన్? ఆయన నేపథ్యం ఏంటి?
అమెరికాలోని మిన్నియాపాలిస్‌లో జన్మించిన అనిల్ మీనన్ తల్లిదండ్రులు భారతదేశం, ఉక్రెయిన్ దేశాల నుండి వలస వెళ్లినవారు. ఆయన వృత్తిరీత్యా ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్ (డాక్టర్). అంతేకాకుండా, అమెరికా స్పేస్ ఫోర్స్‌లో కల్నల్‌గా కూడా సేవలు అందించారు.
-
మిలిటరీ & సేవా రంగం: గతంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన అనిల్ మీనన్, అఫ్గానిస్తాన్‌లో జరిగిన ‘ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్’లో పాల్గొన్నారు. అలాగే ‘ “హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ రెస్క్యూ అసోసియేషన్’తో కలిసి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే పర్వతారోహకులకు వైద్య సేవలు అందించారు.
-
భారతదేశంతో బంధం: అమెరికాలోనే జన్మించినా భారత్‌తో ఆయనకు బలమైన అనుబంధం ఉంది. రోటరీ అంబాసిడరియల్ స్కాలర్‌గా ఆయన మనదేశంలో ఒక సంవత్సరం పాటు ఉండి, పోలియో నిర్మూలన కార్యక్రమాలపై విస్తృత పరిశోధనలు చేశారు.
-
నాసా మరియు స్పేస్‌ఎక్స్ ప్రస్థానం: 2014లో నాసాలో ‘ఫ్లైట్ సర్జన్’గా చేరి వ్యోమగాముల ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. 2018లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీలో చేరి, అక్కడ మెడికల్ ప్రోగ్రామ్‌ను నిర్మించడంతో పాటు ‘స్టార్‌షిప్’ (రాకెట్) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అనంతరం డిసెంబర్ 2021లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికై, రెండేళ్ల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు.
భార్యాభర్తలిద్దరూ వ్యోమగాములే: అనిల్ మీనన్ భార్య అన్నా మీనన్ (అన్నా విల్హెల్మ్) కూడా వ్యోమగామి కావడం విశేషం. ఆమె సెప్టెంబర్ 2024లో స్పేస్‌ఎక్స్ సంస్థ చేపట్టిన ప్రైవేట్ మిషన్ ‘పోలారిస్ డాన్’ (Polaris Dawn) ద్వారా ఇప్పటికే అంతరిక్షంలోకి వెళ్లి 5 రోజులు గడిపి వచ్చారు.
అంతరిక్షంలో అనిల్ మీనన్ ఏం చేయబోతున్నారు?
స్పేస్ స్టేషన్‌లో ఉండే 8 నెలల కాలంలో అనిల్ మీనన్ మానవ శరీరంపై అంతరిక్ష ప్రయాణాల ప్రభావం గురించి కీలక ప్రయోగాలు చేయనున్నారు:
-
శరీరంలో మార్పులపై పరిశోధన: గురుత్వాకర్షణ శక్తిలేని (Microgravity) వాతావరణంలో మానవ రక్త ప్రసరణ, సిరల నిర్మాణం, మరియు రక్తం యొక్క కూర్పు ఎలా మారుతుందో ఆయన పరిశీలిస్తారు. భవిష్యత్తులో చేపట్టబోయే సుదూర అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయి.
-
అధునాతన మెడికల్ టెక్నాలజి “గురుత్వాకర్షణ శక్తి లేని” అంతరిక్ష కేంద్రంలోని తాగునీటి వ్యవస్థ ఆధారంగా ‘ఐవీ ఫ్లూయిడ్స్’ (Intravenous Fluids) తయారు చేసే సరికొత్త సాంకేతికతను పరీక్షించనున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లే దీర్ఘకాలిక మిషన్లలో వైద్య సామాగ్రి కొరత రాకుండా ఇది ఉపయోగపడుతుంది.
-
ఏఐ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీల సాయంతో అల్ట్రాసౌండ్ అధ్యయనాలు చేస్తారు. దీనివల్ల భూమిపై ఉన్న డాక్టర్ల సాయం లేకుండానే అంతరిక్షంలో అత్యవసర వైద్యం అందించే వీలు కలుగుతుంది.
-
సెమీకండక్టర్ క్రిస్టల్స్ తయారీ: అంతరిక్షంలో హై-క్వాలిటీ సెమీకండక్టర్ క్రిస్టల్స్ భారీగా ఉత్పత్తి చేసే పరిశోధనలను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇవి సూపర్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మరియు వైద్య పరికరాల తయారీలో ఎంతో కీలకం కానున్నాయి.
కింది టైటిల్‌పై క్లిక్ చేసి వాటిని కూడా చదవొచ్చు
సింగిల్ ఛార్జ్‌పై 187 కిమీ రేంజ్.. మార్కెట్లోకి హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘Vida VX2 Plus’!
iQOO Z11: త్వరలోనే గ్రాండ్ ఎంట్రీ!
భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో వస్తున్న రెడ్‌మి నోట్ 17 సిరీస్.. లీకైన పూర్తి వివరాలు!
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో రివ్యూ: 6500mAh బ్యాటరీతో అదుర్స్, కానీ ఇండియాలో..!
