అమెరికా వ్యవసాయంపై తెలంగాణ వ్యవశాఖ మంత్రి అధ్యయనం
హైదరాబాద్ తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యం అన్నారు. సాగులో ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి బృందం రెండో రోజు పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలన్నారు. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నం. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమైంది. ఇక్కడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా మనదేశానికి భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఇక్కడి రైతులు కొంత కార్పొరేటీకరణ వల్ల ప్రభుత్వం విూద పెద్దగా అధారపడటం లేదని, అధ్యయనంలో తేలిందననారు. తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడ దన్నారు. అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితమై యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలని అన్నారు. సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే భవిష్యత్‌లో కార్పొరేట్లకు ధీటుగా నిలబడటం సాధ్యపడుతుంది. సహకార శక్తి సంఘటితం అయితే ఏ కార్పొరేట్ శక్తి కూడా దాని ముందు నిలవలేదని స్పష్టం చేశారు. సహకార సంఘాలను విజయవంతంగా ఎలా నడపాలో మహారాష్ట్ర చక్కెర రైతుల అనుభవం నుంచి, తెలంగాణ ముల్కనూరు సహకార సంఘాల నుంచి నేర్చుకోవాలని సూచించారు. యాంత్రీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో యంత్ర పరికరాలను చౌకగా అద్దెకు ఇచ్చేలా ఊబరైజేశన్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి చర్చ జరగాలన్నారు. అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రంలోని డికెటర్ నగరంలో ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరై ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫార్మ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షుడు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ విూడియా డైరెక్టర్ కొణతం దిలీప్, తదితరులు పాల్గొన్నారు.