నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. నియామకాలు నీళ్లు నిధుల పేరుతో తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు ఊపిరి పోసి జీవితాలను ప్రాణాలను బలిదానం చేసిన విషయం కెసిఆర్ మర్చిపోయి, ఆంధ్ర పాలకుల అడుగుల్లో నడుస్తూ తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని దాసు అన్నారు. 9 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగ సమస్యను పక్కకు పెట్టి,
అనేక కుటుంబాలకు కడుపుకోత మిగిల్చిన కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రవళిక ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల పరీక్షల నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే గ్రూప్ 01 రద్దు, గ్రూపు 02 డీఎస్సీ పరీక్షలు ఇప్పుడు వాయిదా పడ్డాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 1,40,000 పోస్టులు వెంటనే భర్తీ చేస్తామని బహిరంగంగా ప్రకటించి కాలయాపన చేసి, నిరుద్యోగ యువత మరణాలకు కేసీఆర్ సర్కార్ కారణమైందని ఆయన అన్నారు. టియస్పిఎస్ సి లో అవినీతి రాజ్యమేలుతుందని,TSPSC బోర్డును వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలను అంధకారంగా మార్చడం అన్యాయమని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించి, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించే పరిపాలనకు పాతర వేయడానికి పోరు జెండాఎత్తాలి. కానీ కుటుంబ సభ్యులకు కన్నీటి బాధ మిగిల్చకూడదని నిరుద్యోగ యువతకు దాసు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన మీరు, తెలంగాణ రాష్ట్రంలో మాట తప్పిన పాలకులకు మతిపోయే విధంగా నిరుద్యోగ యువత పోరాటం చేయాలని, యువతకు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు ఉంటుందని దాసు తెలిపారు.