మేక పావురాలను దొంగతనం చేశారని అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కట్టెలతో కొట్టిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో మేక, పావురాలను దొంగిలించారనే అనుమానంతో మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ తాలూకాలో గల హరేగావ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 సంవత్సరాల వయసు గల నలుగురు దళిత యువకులను ఆగస్టు 25న 6గురు వ్యక్తులు వారి వారి ఇంటి నుంచి తోలుకెళ్లారు. ఆ యువకులను చెట్టుకు తల కిందులుగా వేలాడదీసి మేకను, పావురాలను ఎత్తుకెళ్లారనే అనుమానంతో కట్టెలతో కొట్టినట్టు బాధితులు తెలిపారు. ఆ ఆరుగురిలో యువరాజ్ గలాండే, మనోజ్ బోడకే, పప్పు పార్కే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బొరాగేగా గుర్తించారు. వీరిలో ఒకరు వీడియో తీయడంతో పాటు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.